Mushroom veg or Nonveg: పుట్టగొడుగులు శాకాహారమా లేక మాంసాహారమా? శాకాహారులు వాటిని ఎందుకు తినరు?
Mushroom veg or Nonveg: పుట్టగొడుగులను చాలా మంది మాంసాహారంగా భావిస్తారు. అందుకే శాకాహారులెవ్వరూ దీన్ని తినరు.
Mushroom veg or Nonveg: పుట్టగొడుగుల కూరను చూస్తుంటే నోరూరిపోతుంది ఎంతో మందికి. అలా నోరూరిన వారంతా కచ్చితంగా మాంసాహారులే అయ్యుంటారు. ఎందుకంటే శాకాహారులెవ్వరూ ఈ కూర తినేందుకు ఇష్టపడరు. దాన్ని మాంసాహారంగానే భావిస్తారు. అందుకే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పుట్టగొడుగులు... పూర్తి శాకాహారుల అభిప్రాయంలో ఇవన్నీ ఒక్కటే. కానీ చాలా అధ్యయనాలు పుట్టగొడుగులను శాకాహారంలో కలిపేశాయి. అంతెందుకు బయట ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో పుట్టగొడుగులు శాకహార మెనూలోనే ఉంటాయి. కానీ సాధారణ ప్రజల్లో మాత్రం అది మాంసాహారంతో సమానం. చిన్న మొక్కల్లా కనిపించే పుట్టగొడుగులను చూసి మాంసాహారమనే ఆలోచన అసలెందుకు పుట్టింది?
ఇవి ఏ జాతికి చెందినవి?
ఇవి మాంసాహారమా లేక శాకాహారమా చెప్పాలంటే ముందుగా అవి ఏ జాతికి చెందుతాయో చెప్పాలి. పుట్టగొడుగులు వృక్షశాస్త్రం ప్రకారం మొక్క జాతి కాదు. అలాగే జంతు జాతి కూడా కాదు. అవి శిలీంధ్రాల వర్గానికి చెందినవని చెప్పారు శాస్త్రవేత్తలు. దీనికి ఆకులు, వేర్లు, గింజలు ఏవీ ఉండవు. పెరగడానికి కాంతి కూడా అవసరం లేదు. తాను బతకడానికి దగ్గరలో ఉన్న సేంద్రియ పదార్థాలను తిని పెరుగుతుంది. అందుకే వీటిని కూరగాయల వర్గంలోకి లెక్కించలేరు. శిలీంధ్రాలు కూడా సూక్ష్మజీవులే అని చాలా మంది శాకాహారుల నమ్మకం. ఇక ఆ వర్గానికి చెందిన పుట్టగొడుగులు కూడా మాంసాహారం కిందకే వస్తుంది కదా అని వారి వాదన. ఒక విధంగా ఆలోచిస్తే అది నిజమే కదా అనిపిస్తుంది. అయితే వాటి పుట్టుకకు శిలీంధ్రాలు కారణం అయినా పెరిగాక మాత్రం గొడుగు ఆకారంలో ఉండే మొక్కలాగే ఉంటుందని, దానికి జీవం కూడా ఉండదు కాబట్టి మాంసాహారం కాదని, శాకాహారులు తినవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
2005లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ప్రొటిస్టాలజిస్ట్స్ అందరూ కలిసి "ది జర్నల్ ఆఫ్ యూకారియోటిక్ మైక్రోబయాలజీ"లో ఓ కథనాన్ని రాశారు. అందులో జంతువు, శిలీంధ్రాలను కలిపిన ఒక వర్గం ఉందని చెప్పారు. ఈ వర్గాన్ని Opisthokonts అని పిలుస్తారు. ఈ సమూహానికే పుట్టగొడుగులు చెందుతాయని అన్నారు. వీటికి సెల్యులార్ నిర్మాణం, జన్యువులు రెండింటితోనూ సంబంధం ఉంటుందని చెప్పారు శాస్ర్తవేత్తలు. అంటే వీరు చెప్పిన ప్రకారం పుట్టగొడుగుల పూర్తిస్థాయిలో కూరగాయల వర్గానికి రావు. అందుకే శాకాహారులు పుట్టగొడుగులను శాకాహారం అంటే ఒప్పుకోరు.
కూరగాయగానే...
అమెరికా వ్యవసాయ శాఖ మాత్రం వీటిని కూరగాయగానే గుర్తించింది. దానికి కారణం అది అందించే పోషకాలే. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అధ్యయనకర్తలు చెప్పిన ప్రకారం మాంసం, ధాన్యాలు రెండింటిలో లభించే పోషకాలు పుట్టగొడుగుల్లో నిండుగా ఉంటాయి. అందుకే అందరూ వాటిని తినాలన్న ఉద్దేశంతో అమెరికా అధికారులు వాటిని శాకాహార జాబితాలో పెట్టినట్టు చెప్పారు.
కోడి ముందా? గుడ్డు ముందా? అనే చిక్కుముడి వీడనట్టే... పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? అనేది కచ్చితంగా తేల్చి చెప్పే అవకాశం లేదు. ఇక్కడ సైన్సు చెప్పే పరిశోధనల కన్నా, వ్యక్తిగత నమ్మకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు.
Also read: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారంటే