
Dermatomyositis Disease : ఆ నటి చనిపోయింది ఈ వ్యాధితోనే.. ఆ సమస్యతో బతికే అవకాశాలు చాలా తక్కువట
Rare Disease : దంగల్ సినిమాలో నటించిన సుహాని భట్నాగర్ డెర్మాటోమియోసిటిస్ అనే కండరాల బలహీనతతో ప్రాణాలు విడిచింది. ఇంతకీ ఈ వ్యాధి అంత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఏంటి?

All about Dermatomyositis Disease : కొన్ని వ్యాధులు ఎందుకు.. ఎప్పుడు.. ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేము. ఎవరికైనా ఏదైనా జరిగితేనే కానీ అదొక వ్యాధి ఉందనే విషయం కూడా కొందరికి తెలియదు. తాజాగా దంగల్ సినిమాలో బబితా ఫోగట్ చిన్ననాటి పాత్ర పోషించిన సుహాని భట్నాగర్ ఇలాంటి ఓ అరుదైన వ్యాధితోనే కన్నుమూసింది. 19 ఏళ్ల సుహాని డెర్మాటోమియోసిటిస్ అనే కండరాల బలహీనతతో కన్నుమూసింది. ఇప్పటివరకు ఈ వ్యాధి అంటూ ఒకటి ఉందని కొందరికి తెలియదు. మరి ప్రాణాంతక వ్యాధి లక్షణాలు ఏమిటి? దీనికి ఎలాంటి చికిత్స ఉండదా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బతికే అవకాశాలు తక్కువ
డెర్మాటోమియోసిటిస్ అనేది చర్మంపై దద్దుర్లతో వచ్చే కండరాల బలహీనత. ఇదొక అరుదైన వ్యాధి. ఇది ఇడియోపతిక్ ఇన్ఫ్లమేటరీ మయోపతిలో ఒకటిగా వర్గీకరించారు. అయితే పరిశోధనల పరంగా, వైద్యపరంగా ఇది భిన్నంగా ఉంటుంది. ఇది పల్మనరీ, కార్డియోవాస్కులర్, జీర్ణశయాంతర వ్యవస్థల వంటి ఇతర అవయవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. అందుకే డెర్మోటోమియోసిటిస్ ఉన్న రోగులు బతికే అవకాశాలు తగ్గిపోతాయి.
పదిరోజుల ముందే రోగనిర్ధారణ
డెర్మటోమయోసిటిస్ అనేది పెద్దల నుంచి పిల్లల వరకు అందరినీ ప్రభావితం చేసే ఓ అరుదైన వ్యాధి. ఈ అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధితోనే సుహానీ భట్నాగర్ కన్నుమూసింది. ఈ వ్యాధి ప్రభావం రెండు నెలల క్రితం మాత్రమే కనిపించాయని.. ఆమె మరణానికి పదిరోజుల ముందు మాత్రమే రోగ నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. ముందుగా ఆమె చేతిలో వాపు వచ్చిందని.. అది కేవలం చర్మ వ్యాధి అనుకుని చర్మ వ్యాధి నిపుణుల దగ్గరకు తీసుకెళ్లామని పేరెంట్స్ తెలిపారు. ఆమెను ఎయిమ్స్లో చేర్చినప్పుడే డెర్మాటోమయోసిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు.
ఆ వయసు వారిపై ప్రభావం ఎక్కువ
ఓ శస్త్ర చికిత్స సమయంలో ఆమెకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని.. ఆమె శరీరం ద్రవాలు ఉత్పత్తి చేయడం ప్రారంభించిదని వైద్యులు తెలిపారు. ఈ ద్రవాలు సుహాని ఊపిరితిత్తులను బాగా ప్రభావితం చేశాయని వెల్లడించారు. చివరికి ఆమె మృత్యు ఒడి చేరుకుంది. ఈ వ్యాధి పెద్దవారిలో 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వస్తుంది. పిల్లల్లో 5 నుంచి 15 సంవత్సరాల మధ్య కనిపిస్తుంది.
లక్షలో ఇద్దరికి వచ్చే వ్యాధి
ఈ వ్యాధి మగవారి కంటే ఆడవారినే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని వైద్యులు తెలిపారు. పైగా ఇది ఎందుకు వస్తుందనే దానిపై సరైన క్లారిటీ కూడా లేదు. అయితే ఇది కండరాలకు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలగవచ్చు. యూవీ రేడియేషన్, వాయు కాలుష్య కారకాలతో సహా పర్యావరణ కారకాలు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగించే స్టాటిన్స్ వంటి మందుల వల్ల ఇది జరగవచ్చు. ఇది చాలా ఎంత అరుదైన వ్యాధి అంటే.. ప్రతి లక్షమందిలో ఇద్దరూ లేదా ముగ్గురు దీని బారిన పడతారు.
డెర్మటోమయోసిటిస్ లక్షణాలు..
డెర్మటోమయోసిటిస్ వస్తే భుజాలు, పై చేతులు, తుంటి, తొడలు, మెడ కండరాలు బాగా బలహీనపడిపోతాయి. రోగి తన చేతులను భుజం స్థాయికి ఎత్తడం కూడా కష్టమవుతుంది. కుర్చీ లేదా నేలపై కూర్చున్న స్థానం నుంచి పైకి లేవడం కూడా కష్టంగా ఉంటుంది. శరీరమంతా దద్దుర్లు, కీళ్ల నొప్పులు, వాపులు, గుండె, ఊపిరితిత్తుల కండరాల కణజాలాల వాపు, మీ చర్మం, కండరాలకు సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు కూడా ఉంటుంది.
చికిత్స
సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. మింగడం, శ్వాసక్రియ, కండరాలపై తీవ్ర ప్రభావం కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు సూర్యరశ్మిలోకి వెళ్లకపోవడమే మంచిది. సన్స్క్రీన్లు, ఫోటోప్రొటెక్టివ్ దుస్తులు ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే దద్దుర్ల ప్రభావం తీవ్రమవుతుంది.
Also Read : పిల్లల ఎదుగుదలకు ఇలాంటి ఆహారం కచ్చితంగా తీసుకోవాలట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

