One Kidney Village: వన్ కిడ్నీ విలేజ్ - ఒకే ఒక్క మూత్ర పిండంతో బతికేస్తున్న గ్రామస్తులు, లోపం కాదు శాపం!
‘వన్ కిడ్నీ విలేజ్’ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ గ్రామంలో అందరికీ ఒకే కిడ్నీ ఉంది. అయితే, అది లోపం కాదు. ఆ దేశంలో పుట్టడమే వారి శాపం.
One Kidney Village | ప్రతి ఒక్కరికి రెండేసి కిడ్నీలు ఉంటాయి. కానీ, ఆ గ్రామంలో దాదాపు అందరికీ సింగిల్ కిడ్నీయే ఉంది. అంటే, వారంతా ఒకే ఒక మూత్ర పిండంతో జీవించేస్తున్నారు. అదేంటీ, అదేమైనా వింత లేదా? రోగమా? అనేగా మీ సందేహం? అయితే, అది రోగం కాదు, వింత కాదు. ఇదొక విషాద గాధ.
అఫ్గానిస్థాన్‌లో శెంశాయిబా బజార్ అనే గ్రామం ఉంది. అయితే, అంతా ఆ గ్రామాన్ని ‘వన్ కిడ్నీ విలేజ్’ అని మాత్రమే పిలుస్తారు. ఎందుకంటే, ఆ గ్రామంలోని ప్రజలు కేవలం ఒకే ఒక్క కిడ్నీతో జీవిస్తున్నారు. ఎందుకంటే, మరో కిడ్నీని వారంతా మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ పోషణ కష్టం కావడంతో ఆ గ్రామస్తులు తమ కిడ్నీలను దానిమిస్తున్నారు. అలా సంపాదించిన సొమ్ముతో జీవితాన్ని సాగిస్తున్నారు.
ఇన్నాళ్లు అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. గతేడాది తాలిబన్లు అఫ్టానిస్థాన్‌ను కైవసం చేసుకున్నారు. అయితే, ఇప్పటికీ అక్కడి పరిస్థితులు మెరుగుపడలేదు. ఇంకా ఆ దేశం ఇరుగుపొరుగు దేశాల సాయం మీదే బతుకుతోంది. ఇక అక్కడి ప్రజల పరిస్థితి మరింత దయనీయం. తినేందుకు ఆహారం కొనుగోలు చేసే ఆర్థిక బలం కూడా వారికి లేదు. దీంతో వారంతా తమ కిడ్నీలను బ్లాక్ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు.
32 ఏళ్ల నూరుద్దీన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా కిడ్నీని అమ్మడం నాకు ఇష్టం లేదు. కానీ, నాకు వేరే దారి లేదు. ఇది నా పిల్లల కోసం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలా చేసినందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది. ఏ పనిచేయలేకపోతున్నా, బరువులు కూడా ఎత్తలేకపోతున్నా’’ అని తెలిపాడు.
ప్రపంచంలో ఏ దేశంలోనైనా అవయవాలను అమ్మడం, కొనుగోలు చేయడం నేరం. కానీ, అఫ్గానిస్థాన్‌లో దీనికంటూ ప్రత్యేకమైన చట్టం లేదు. మరో చిత్రం ఏమిటంటే అఫ్గా్న్ ప్రజలు దానం చేస్తున్న ఆ కిడ్నీలు ఎక్కడికి వెళ్తున్నాయనేది కూడా ఎవరికీ తెలియదు. అవయవాలను స్మగ్లింగ్ చేసేవారికి ఇప్పుడు అఫ్గాన్ ప్రజలు బంగారు బాతులా దొరికారు. స్థానిక వైద్యులతోనే ప్రజల నుంచి అవయవాలను సేకరిస్తూ విదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై వైద్యులను ప్రశ్నిస్తే.. కిడ్నీలను తీయడం వరకే తమ డ్యూటీ అని, వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవడం తమ పని కాదని అంటున్నారు.
Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు
ఇప్పటివరకు అఫ్గానిస్థాన్‌లో ఎన్ని కిడ్నీలు అమ్ముడయ్యాయనేది కూడా లెక్క లేదు. హెరత్ ప్రావీన్స్‌లో వందలాది కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్లు మాత్రం సమాచారం ఉంది. అఫ్గాన్‌లో ఆర్థిక ఇబ్బందులు పెరిగిన ప్రతీసారి ఈ ఆపరేషన్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయట. కిడ్నీని అమ్ముకున్న ఓ మహిళ మాట్లాడుతూ.. ‘‘నా కిడ్నీని 250,000 అఫ్గానిస్ (రూ.2,21,273)కు విక్రయించాం. నా భర్త ఏ పనిచేయడం లేదు. దీంతో అప్పులు తీర్చడానికి మరో మార్గం లేక ఈ పని చేయాల్సి వచ్చింది’’ అని తెలిపింది. మరో మహిళ మాట్లాడుతూ.. ‘‘నా పిల్లలు వీధుల్లో తిరుగుతూ బిక్షాటన చేస్తున్నారు. నా కిడ్నీలు అమ్మకపోతే, నా ఏడాది బిడ్డను అమ్ముకోవలసి వచ్చేది’’ అని వాపోయింది.
Also Read: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?
ఈ కిడ్నీల అమ్మకాలు ఎప్పటికి ఆగుతాయనేది ఇప్పట్లో చెప్పలేం. ఎందుకంటే, ఆఫ్గానిస్థాన్ ఇంకా ఆయుధాల నీడలోనే ఉంది. ఆ దేశం తాలిబన్లకు చిక్కిన తర్వాత 24 మిలియన్ మంది ప్రజల్లో 59 శాతం మందికి ఉద్యోగాలు లేవు. దీంతో.. ‘వన్ కిడ్నీ విలేజ్’ బాటను మరిన్ని గ్రామాలు అనుసరించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి, వారిని ఆదుకొనేది ఎవరో!!