తుమ్ము ఆపొద్దు, ప్రాణాలు పోతాయ్ - ఆపడానికి ప్రయత్నించిన అతడికి ఏమైందో తెలుసా?
బ్రిటన్ లో తుమ్ము ఆపుకున్న పాపానికి పెద్ద ఆరోగ్య సమస్యలో ఇరుక్కున్నాడట. వైద్యులు పరీక్షలు చేసి ఆశ్చర్య పరిచే ఆ వివరాలను అందించారు.
మీరు తుమ్మును బలవంతంగా ఆపేసుకుంటున్నారా? అయితే, అలా అస్సలు అలా చేయొద్దు. ఎందుకంటే.. తుమ్మును ఆపడం ప్రాణాంతకం. ఇందుకు, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. ఇంతకీ అతడికి ఏమైంది? తుమ్మును బలవంతంగా ఆపితే ఏమవుతుంది?
తుమ్ము ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ముక్కులో ఏదైనా ధూళి కణాల్లాంటివి చేరినపుడు అత్యంత వేగంగా దాన్ని బయటికి పంపేందుకు శరీరం చేసే ప్రతిస్పందన. తుమ్ము జలుబు లక్షణాల్లో ఒకటి. అయితే తుమ్ము చుట్టూ రకరకాల విషయాలు ఉంటాయి. కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి. వేళకాని వేళ తుమ్మారని తిట్టేస్తారు కూడా. తుమ్ముని అపశకునంగా కూడా భావిస్తారు. ఇలాంటి కొన్ని నమ్మకాలో లేక తుమ్ము కొన్ని సందర్భాల్లో డిస్టర్బెన్స్ అని ఆపుకుంటూ కూడా ఉంటారు.
ఇలా ఆపుకోవడం వల్ల బ్రిటన్ లో ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడట. బలంగా తుమ్ము ఆపుకున్నందుకు అతడి గొంతులోపల గాయం అయ్యింది. 2018లో BMJ కేస్ రిపోర్ట్స్ లో ఈ కథనం ప్రచురించారు. 34 సంవత్సరాల వయసున్న వ్యక్తి నోరు గట్టిగా మూసుకుని, రెండు నాసికా రంధ్రాలను కూడా మూసుకుని చాలా బలంగా తుమ్మును ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ తుమ్ము ద్వారా వెలువడిన శక్తి అతడి గొంతులోపల గాయం చేసింది.
ఆ తర్వాత నుంచి మింగడంలో ఇబ్బంది, స్వరంలో మార్పు , మెడలో పాపింగ్ శబ్ధాల వంటి వింత వింత లక్షణాలు కనిపించడం మొదలైంది. తుమ్మును ఆపే ప్రయత్నంలో అతడి గొంతులో తుమ్ము ద్వారా ఉత్పన్నమైన గాలి గొంతులో ఇరుక్కుందని, అందువల్ల గొంతులోని కొన్ని కణజాలాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఫారింక్స్ గాయపడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా వాంతులు, తీవ్రమైన దగ్గు వల్ల ఫారింక్స్ గాయపడుతుంది.
ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారితీసే ప్రమాదం ఉంటుందని భావించి వైద్యులు పరీక్షల అనంతరం అతడిని పర్యవేక్షణలో ఉంచారు. అతడికి ఫీడింగ్ ట్యూబ్, యాంటీ బయాటిక్స్ చికిత్సగా ఇచ్చారు. రెండు వారాల చికిత్స తర్వాత మృదువైన ఆహారం తీసుకునేందుకు వీలుగా అతడు కోలుకున్నాడు.
నోరు, ముక్కు ఒకే సారి మూసుకుని తుమ్మును ఆపడం చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తుమ్ము ఆపకపోవడమే మంచిది. కారణం ఏదైనా సరే! తుమ్మును ఆపే ప్రయత్నం చెయ్యకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. తుమ్ము ఆపుకోవడం వల్ల సూడోమెడియాస్టీనమ్ అంటే గాలి రెండు ఊపిరితిత్తుల మధ్య చిక్కుకోవడం, టింపాటిక్ పొరకి రంధ్రం పడడం అంటే తీవ్రమైన చెవి పోటు, సెరిబ్రల్ అనూరిజం అంటే మెదడులో రక్తనాళం చిట్లడం వంటి రకరకాల తీవ్రమైన సమస్యలకు కారణం కావచ్చు. కనుక ఓపెన్ గా తుమ్మడమే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
Also read : మహిళలకు నరకం చూపే వ్యాధులివే - ఈ జాగ్రత్తలు పాటిస్తే లైఫ్ బిందాస్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial