Watch Video: దీవిలో ఒంటరిగా 29 ఏళ్లు బతికిన వ్యక్తి, ఆ దీవికి గుడ్ బై చెప్పాల్సి వస్తే, వీడియో చూడండి
కొందరి జీవితాలు విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్ర జీవితమే ఈయనది.
జనజీవితానికి విసిగిపోయాడు. సిటీ జీవనంపై విరక్తి వచ్చింది. అప్పటికే ఆయనకు 50 ఏళ్లు. భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఆర్ధిక ఒత్తిళ్లు, సిటీ వాతావరణం అన్నీ కలిసి ఆయనలో ఎక్కడికైనా, ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోవాలన్న కోరికను పెంచాయి. అతని పేరు నాగసాకి. జపాన్లో నివసిస్తున్నారు. 1989లో భార్యా, ఇద్దరు పిల్లలను వదిలి తాను జీవిస్తున్న జపాన్‌ను వదిలి సముద్ర జలాల మధ్యలో ఉన్న సోటోబనారీ దీవికి వెళ్లిపోయాడు. అది అడవితో నిండిన ఒక దీవి. ఒక్క మనిషి కూడా ఉండడు. 1989 నుంచి నాగసాకి అక్కడే జీవించసాగాడు. అలా 2018 వరకు ఒక్కడే జీవించాడు. కానీ 2018లో చావు నుంచి బయటపడి తిరిగి సిటీకి చేరాడు.
మళ్లీ సిటీకి ఎందుకు?
2018 నాటికి అతనికి 83 ఏళ్లు. అంతవరకు ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేకుండా బతికిన ఆయన హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆ సముద్రజలాల నుంచి ప్రయాణిస్తున్న కొందరు జాలరి వాళ్లు ఇతను ఒడ్డున పడి ఉండడం చూసి సిటీకి మోసుకొచ్చారు. అతడిని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ముసలితనం వల్ల చాలా అనారోగ్యాలు దాడి చేసే అవకాశం ఉందని, తిరిగి దీవిలో ఒంటరిగా జీవించొద్దని సిఫారసు చేశారు. ఇదే సమయంలో అతని కథను ప్రపంచానికి తెలిసేలా చేశారు. తన వారెవరో కూడా తెలియదు నాగసాకికి. ఇషిగాకి నగరంలోనే ఆయన జీవించసాగారు. అతని బాగోగులు కొంతమంది మంచి మనుషులు చూసుకోసాగారు. దీవిలో ఒంటరిగా జీవించిన ఆయన సిటీలో బతికేందుకు చాలా కష్టపడ్డారు. రోడ్డు మీద కనిపించిన చెత్తనంతటిని ఏరేసేవారు. అలా నాలుగేళ్లే సిటీలోనే ఉండిపోయారు. నాలుగేళ్ల తరువాత ఆయనకు తిరిగి దీవిలోని తన ఇంటిని చూసుకోవాలనిపించింది. ఎప్పుడ చనిపోతానో తెలియదని ఒకసారి తన పాత ప్రపంచంలోకి ఓసారి వెళ్లాలనుందని చెప్పాడు. అతడిని తీసుకెళ్ల బాధ్యత ఓ కంపెనీ తీసుకుంది.
ఆ దీవిలో నగ్నంగా...
అతడిని తీసుకుని కెమెరాలతో సహా వెళ్లారు కంపెనీ ప్రతినిధులు. దీవిలోకి వెళ్లగానే నాగసాకి ఆనందం ఇంతా అంతకాదు. వెంటనే దుస్తులు తీసివేసి అంతకుముందు తాను 29 ఏళ్లు ఎలా ఉన్నాడో ఆ అవతారంలోకి మారిపోయాడు. ఆ ప్రదేశమంతా ఆనందంతో గెంతుతూ తిరిగాడు. తన ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ గుడారం కూలిపోయి నేలమట్టం అయ్యింది. ఆ గుడారంలో ఉన్న ఫోటోలు, కొన్ని వస్తువులు ఏరి తెచ్చుకున్నాడు. అతని వీడియోను మీరు ఒకసారి చూస్తే కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారు.
Also read: ఆ ఆలయం గోడలపై 900 ఏళ్ల నాటి ఆప్టికల్ ఇల్యూషన్ , ఇది వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది
Also read: మటన్‌తో కీమా ముట్టీలు, చల్లని సాయంత్రం వేడిగా తింటే ఆ మజాయే వేరు