United Nations: ప్రతి ఏడు సెకన్లకు ఒక శిశువు లేదా ఒక తల్లి మరణం, కలవరపెడుతున్న ఐక్యరాజ్యసమితి నివేదిక
ప్రపంచంలో ప్రతి ఏడు సెకన్లకు ఒక ప్రసూతి మరణం సంభవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
ప్రపంచంలో ప్రసూతి మరణాల సంఖ్య తగ్గడం లేదు. ప్రతి ఏడు సెకన్లకు ఎక్కడో ఒకచోట నవజాత శిశువు మరణించడం లేదా ప్రసవం సమయంలో తల్లి మరణించడం జరుగుతోంది. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి కావాల్సిన పెట్టుబడులను దేశాలు తగ్గించడం వల్లే ఇలా జరుగుతోందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో చెబుతోంది. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రసవ సమయంలో లేదా ప్రసవం జరిగిన మొదటి వారంలో ఏటా 4.5 మిలియన్ల మంది పిల్లలు, శిశువులు మరణిస్తున్నట్టు సర్వేలో తెలిసింది. అంటే ప్రతి ఏడు సెకన్లకు ఒక తల్లి లేదా అప్పుడే పుట్టిన బిడ్డ మరణిస్తున్నారని అర్థం. ఈ మరణాల్లో చాలా వరకు నివారించదగినవే ఉన్నాయి, కానీ అవసరమైన ఆరోగ్య పరికరాలు, వైద్యులు అందుబాటులో లేని కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 మిలియన్ల నవజాత శిశువులు మరణిస్తున్నారు, అంటే పుట్టిన మొదటి నెలలోనే వీరు వివిధ ఆరోగ్య సమస్యల వల్ల మరణిస్తున్నారు. వీరికి చికిత్స అందితే అవకాశాలు ఎక్కువే. కోవిడ్ మహమ్మారి చేసిన అల్లకల్లోలం, పెరుగుతున్న పేదరికం, మానవతా సంక్షోభాలు వంటివన్నీ కూడా ప్రసూతి, నవజాత శిశువుల ఆరోగ్య సేవలపై ఒత్తిడి పడేలా చేస్తున్నాయి. ఫలితంగా తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యానికి నిధులు అందించడాన్ని దేశాలు తగ్గించినట్టు నివేదిక హైలెట్ చేస్తుంది.
ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ప్రసవానికి కావాల్సిన సౌకర్యాలు కనీసం లేవు. నవజాత శిశువుల సంరక్షణ యూనిట్లు కూడా లేవు. దీనివల్లే అక్కడ ఎక్కువ మంది పిల్లలు, తల్లులు మరణిస్తున్నారు. నెలలు నిండకుండా పుడుతున్న శిశువులను కాపాడేందుకు ఆరోగ్యపరమైన ఎక్విప్‌మెంట్ చాలా అవసరం. అవేవీ కూడా ఆఫ్రికా దేశాల్లో ఉండవు. దీనివల్లే అక్కడ పిల్లలు అధికంగా మరణిస్తున్నారు.
సెప్సిస్, మెనింజైటిస్, నిమోనియా, నియోనాటల్ టెటానస్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడిన శిశువులు అధికంగా మరిణించే అవకాశం ఉంది. ప్రసవం జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ సరిగా అందక మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది కూడా నవజాత శిశువుల మరణానికి దారితీస్తుంది. కొందరు నవజాత శిశువులకు గుండె లోపాలు, నాడీ ట్యూబ్ లోపాలు పుట్టుకతో రావచ్చు. ఇవి కూడా మరణానికి దారితీస్తాయి. ఇక తల్లులు ప్రసవ సమయంలో రక్తం అధికంగా పోవడం వల్ల వారు మరణించే సంఖ్య పెరుగుతోంది. బిడ్డ పుట్టిన వెంటనే అనారోగ్యం పాలైతే వారిని కాపాడే నియోనాటల్ అంబులెన్స్, శిక్షణ పొందిన పారామెడిక్స్ కూడా చాలా దేశాల్లో అందుబాటులో ఉండడం లేదు.
Also read: న్యూజెర్సీ రెస్టారెంట్లో "మోదీ జీ థాలీ", అందులో ఉండే టేస్టీ వంటకాలు ఇవే
Also read: నా భార్య కన్నా ఆమె నాకు ఎక్కువ నచ్చుతోంది, ఏం చేయాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.