(Source: ECI/ABP News/ABP Majha)
ఏడు కిలోలకు పైగా బరువుతో పుట్టిన బిడ్డ - ఇలా భారీ బిడ్డలు పుట్టేందుకు కారణాలు ఏమిటి?
అధిక బరువుతో బిడ్డలు పుట్టడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని ప్రమాదకరమైనవి కూడా.
ఇటీవల ఒక మహిళ ఏడు కిలోలకు పైగా బరువు ఉన్న ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకుముందు కూడా ఇలా అధిక బరువుతో బిడ్డలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. 1955లో ఇటలీలో ఏకంగా 10 కిలోల బరువుతో ఒక బిడ్డ పుట్టింది. ఆ రికార్డు ఇంతవరకు బద్దలు కాలేదు. ఇప్పుడు పదికిలోలకు దగ్గరగా 7.3 కిలోలతో ఒక బిడ్డ బ్రెజిల్‌లో జన్మించింది. అలా పుట్టడం వల్ల పిల్లలు ముద్దుగా కనిపిస్తున్నప్పటికీ, వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. ఇలా భారీ శరీరాలతో పుట్టే బిడ్డలను ‘మాక్రోసోమిక్ బేబీ’ అని పిలుస్తారు. ప్రపంచంలో పుట్టే పిల్లల్లో 12 శాతం మంది ఇలా మాక్రోసోమిక్ బేబీగానే ఉంటారు. నాలుగు కిలోల కంటే ఎక్కువ బరువుతో పుట్టే పిల్లలు అంతా మాక్రోసోమిక్ బేబీలే. సాధారణంగా అప్పుడే పుట్టిన మగపిల్లాడు 3.3 కిలోలు, ఆడపిల్ల 3.2 కిలోలు వరకు ఉండడం సాధారణం. అది దాటితే వారిని భారీ బిడ్డలగానే పరిగణిస్తారు వైద్యలు. అయితే ఇలా మాక్రోసోమిక్ బేబీలు పుట్టడానికి కారణాలను వివరిస్తున్నారు వైద్యులు.
జెస్టేషనల్ డయాబెటిస్
తల్లి గర్భంతో ఉన్నప్పుడు వచ్చే షుగర్ వ్యాధి ఇది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే శిశువులు పొట్టలోనే భారీగా పెరుగుతారు. తల్లికి గర్భం ధరించడానికి ముందు నుంచి షుగర్ వ్యాధి ఉన్నా కూడా, ఇలా భారీ బరువుతో బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. తల్లి బరువు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్న తల్లి శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యం పెరగడంతో పాటు, ప్లాసెంటా నుంచి నుంచి పిండంలోకి వెళ్లే గ్లూకోజ్ పరిమాణం కూడా పెరిగిపోతుంది. దీనివల్ల పిండం అధిక బరువు పెరుగుతుంది. అలాగే ఎవరైతే ఆలస్యంగా బిడ్డలను కంటారు అంటే 35 ఏళ్లు దాటాక గర్భం దాల్చే మహిళల్లో కూడా మాక్రోసోమిక్ బేబీలు కుట్టే అవకాశం 20 శాతం వరకు ఉంది. అలాగే తండ్రి వయసు కూడా అధికంగా ఉంటే ఇలా అధిక బరువుతో పిల్లలు పుట్టే ఛాన్సులు ఉన్నాయి. ఏ బిడ్డలు అయితే సమయానికి ప్రసవం కాకుండా ఎక్కువ కాలం తల్లి కడుపులోనే ఉంటారో, వాళ్లు బరువు అధికంగా పెరుగుతారు. ఆడపిల్లల కన్నా మగపిల్లలే ఇలా అధిక బరువుతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మాక్రోసోమిక్ బేబీ పొట్టలో ఉన్నప్పుడు ఆ తల్లికి నార్మల్ డెలివరీ అవ్వడం అత్యంత కష్టం. కాబట్టి సిజేరియన్ ద్వారానే ప్రసవం చేస్తారు. బిడ్డ అధికంగా బరువు పెరిగిపోవడం వల్ల పొట్టలో వారికి ఊపిరాడని పరిస్థితి కూడా వస్తుంది. అలాగే బిడ్డ శరీరంలో కూడా అవకరాలు వచ్చే అవకాశం ఉంది. బిడ్డ శరీరం లోపల ఇరుక్కు పోవడం వల్ల ఈ అవకరాలు రావచ్చు.
ఇలా అధిక బరువుతో పుట్టే పిల్లలకు భవిష్యత్తులో చాలా చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వారు పుట్టాక కూడా ఏడు నుంచి ఎనిమిదేళ్ల వరకు ఊబకాయంతోనే ఉంటారు. ఆ తరువాత తగ్గే అవకాశం ఉంది. ఇలా అధిక బరువుతో పిల్లలు పుట్టకుండా సాధారణ బరువుతో పుట్టాలి అంటే తల్లి ముందు నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలి. షుగర్ వ్యాధి ఉన్న తల్లులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. వారు ఎంత జాగ్రత్తగా ఉంటే బిడ్డ సాధారణ బరువుతో పుట్టే అవకాశాలు ఉంటాయి.
Also read: ఆహారాలకే అమ్మలాంటివి చిరుధాన్యాలు - వీటిని మెనూలో చేర్చుకుంటే ఎంత ఆరోగ్యమో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.