10K Step Count : రోజూ 10,000 అడుగులు నడవకపోతే ఆరోగ్యానికి మంచిది కాదా? ఎవరు ఎంత నడిస్తే మంచిది? 5 ఏళ్ల నుంచి 60 ఏళ్లు
Walking Benefits : చాలామంది ఉదయాన్నే తమ ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌లో అడుగులు కౌంట్ చేసి.. రోజంతా 10,000 అడుగులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఇలా నడవడం మంచిదేనా? ఏ వయసు వారు ఎంత నడవాలో తెలుసా?

- పదివేల అడుగులు నడవాలనేది అపోహ, వయసును బట్టి మారుతుంది.
- తక్కువ అడుగులు కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమని నిపుణులు, అధ్యయనాలు చెబుతున్నాయి.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దిష్ట అడుగుల సంఖ్య కాకుండా వ్యాయామాన్ని సూచించింది.
- వయసును బట్టి 4,400 నుండి 8,000 అడుగులు మరణ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Walking Goals by Age : ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాలని చాలామంది సలహా ఇస్తుంటారు. దీనిలో భాగంగా ఉదయం నుంచే తమ ఫోన్‌లు లేదా స్మార్ట్‌వాచ్‌లలో అడుగులు లెక్కించడం మొదలుపెట్టి.. రోజు చివరికల్లా ఆ సంఖ్యను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు 10,000 అడుగులు పూర్తి చేయకపోతే మీ ఆరోగ్యానికి పూర్తి ప్రయోజనం చేకూరదా?
నిపుణుల ప్రకారం వయస్సు, ఫిట్‌నెస్, శారీరక సామర్థ్యాన్ని బట్టి.. తక్కువ అడుగులు నడవడం కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి ఒకే సంఖ్యలో నడవాల్సిన అవసరం లేదు. పదివేల అడుగలు నడవాల్సిన అవసరం ఎందుకు లేదో.. ఏ వయసు వారు ఎంత నడిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : ఉదయం నడిస్తే మంచిదా? సాయంత్రం నడక బెటరా? ఎప్పుడు వాక్ చేస్తే మంచిదో తెలుసా?
10,000 అడుగులు నడవాల్సిన అవసరం లేదా?
10,000 అడుగులు నడవాలనే లక్ష్యం చాలా ట్రెండ్ అయింది. కానీ అన్ని వయసుల వారికి ఇది మంచిదని చెప్పలేము. 10,000 అడుగుల కంటే తక్కువ నడవడం కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుందని పరిశోధనలో తేలింది. వృద్ధులు తక్కువ నడవడం ద్వారా సానుకూల ప్రయోజనాలు పొందవచ్చని తేలింది. ఒక అధ్యయనంలో వృద్ధ మహిళలు ప్రతిరోజూ సుమారు 4,400 అడుగులు నడవడం అనేది, సుమారు 2,700 అడుగులు నడిచేవారితో పోలిస్తే తక్కువ మరణ ప్రమాదంతో ముడిపడి ఉందని గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమి చెబుతోందంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివిధ వయసుల వారు.. రోజుకు ఎన్ని అడుగులు వేయాలనే దానిపై నిర్దిష్ట సంఖ్యను నిర్దేశించలేదు. దానికి బదులుగా శారీరక కార్యకలాపాల కోసం మార్గదర్శకాలను నిర్దేశించింది. దీని ప్రకారం.. 5 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల పాటు మధ్యస్థం నుంచి తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనాలి. పెద్దలు అయితే వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు మధ్యస్థ శారీరక శ్రమలో పాల్గొనాలని సిఫార్సు చేసింది. 65 ఏళ్లు పైబడిన వారు కూడా నడకతో సహా, కండరాలను బలపరిచే, సమతుల్యతను కాపాడే వ్యాయామం చేయాలని తెలిపింది.
Also Read : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
5 నుంచి 17 సంవత్సరాల వారు..
పిల్లలు, టీనేజ్‌లో ఉన్నవారు రోజుకు 10,000 నుంచి 12,000 అడుగులు నడవడం మంచిది కావచ్చు. ఈ వయస్సులో పరుగెత్తడం, సైకిల్ తొక్కడం, గేమ్స్ ఆడటం, చురుకైన ఆటలలో పాల్గొనడం మంచిది. వారానికి కనీసం మూడు రోజులు కండరాలను, ఎముకలను బలపరిచే పనులు చేయాలి.
18 నుంచి 39 సంవత్సరాల వారు..
ఈ వయస్సులో ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతిరోజూ 7,000 నుంచి 10,000 అడుగులు నడవడం ఒక మంచి లక్ష్యం కావచ్చు. అయితే ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాలని రూల్ లేదు. ఒక అధ్యయనంలో ప్రతిరోజూ కనీసం 7,000 అడుగులు నడిచేవారికి, 7,000 అడుగుల కంటే తక్కువ నడిచేవారితో పోలిస్తే మరణ ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 10,000 అడుగుల కంటే ఎక్కువ నడవడం వల్ల అదనపు ప్రయోజనం ఏమీ లేదని తేలింది.
Also Read : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
40 నుంచి 59 సంవత్సరాల వారు..
ఈ వయస్సులోని వారు తమ ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని బట్టి రోజుకు 7,000 నుంచి 10,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం రోజుకు 3,000 నుంచి 4,000 అడుగులు మాత్రమే నడుస్తుంటే.. అకస్మాత్తుగా 10,000 అడుగులు చేరుకోవడానికి ప్రయత్నించవద్దు. మీ శారీరక శ్రమను క్రమంగా పెంచుకోండి.
60 నుంచి పైబడిన వారు..
60 నుంచి పైబడిన ఆరోగ్యవంతులు ప్రతిరోజూ 6,000 నుంచి 8,000 అడుగులు నడవవచ్చు. JAMAలో ప్రచురించిన పరిశోధనను ఉటంకిస్తూ చేసిన ఒక మెటా-విశ్లేషణలో.. 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ అడుగులు వేయడానికి, మరణ ప్రమాదం తగ్గడానికి మధ్య ఉన్న సంబంధం సుమారు 6,000 నుంచి 8,000 అడుగుల మధ్య ఉంది. ఈ వయస్సులో సౌకర్యవంతమైన వేగంతో నడవడం, సరైన బూట్లు ధరించడం, నెమ్మదిగా అడుగులు వేయడం ముఖ్యం.
Also Read : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
10,000 అడుగులు నడవడం మంచి లక్ష్యమేనా?
మీరు ప్రతిరోజూ 10,000 అడుగులు సునాయాసంగా నడవగలిగితే.. అది ఒక మంచి వ్యక్తిగత లక్ష్యం కావచ్చు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినంత మాత్రాన.. మీరు నడక వల్ల కలిగే ప్రయోజనాలను పొందడం లేదని అర్థం కాదు. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వారంలోని కొన్ని రోజులలో 8,000 లేదా అంతకంటే ఎక్కువ అడుగులు నడిచే పెద్దవారికి., ఏ రోజూ 10,000 సంఖ్యను చేరుకోని వారితో పోలిస్తే మరణ ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
Also Read : పరగడుపునే వాకింగ్ చేస్తే బరువు వేగంగా తగ్గుతారా? శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచనలు ఇవే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
ట్రెండింగ్ వార్తలు























