UPSC Prelims 2021: నేడు సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష.. అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఉచిత రవాణా సదుపాయం..
యూపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష ఈరోజు నిర్వహించనుంది. హైదరాబాద్ జంట నగరాలు, వరంగల్‌లోని ట్రై సిటీస్‌లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2021 ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు (అక్టోబర్ 10) ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమనరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించాలని.. పరీక్ష సమయానికి అరగంట ముందుగానే కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షకు తెలంగాణకు చెందిన 53,015 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో 46,953 మంది.. వరంగల్‌లో 6,062 మంది పరీక్ష రాయనున్నారు. వీరి కోసం హైదరాబాద్‌లో 101, వరంగల్‌లో 14 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. వీరితో పాటు ఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్న మరో 3 వేల నుంచి 5 వేల మంది తెలంగాణ అభ్యర్థులు సైతం అక్కడ పరీక్షలు రాయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..
అభ్యర్థులకు ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్..
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ జంట నగరాలు, వరంగల్‌లోని ట్రై సిటీస్‌లో ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా.. పైన పేర్కొన్న నగరాల్లో మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఉచితంగా రవాణా చేయవచ్చని స్పష్టం చేశారు.
@TSRTCHQ Management has decided to provide #FreeTransport for the candidates appearing for #UPSCPrelims2021 on 10-Oct-2021 can Avail Free service in All Types of City #Buses including Metro & AC Buses In #Hyderabad & #Warangal by showing their exam Hall Tickets #RTCbusjourney pic.twitter.com/pRUFWWpRkE
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 9, 2021
ప్రిలిమ్స్ చాలా కీలకం..
దేశంలో అత్యన్నత కేంద్ర స్థాయి సర్వీసులైన ఐపీఎస్ (IPS), ఐఏఎస్ (IAS), ఐఎఫ్‌ఎస్ (IFS) వంటి 19 విభాగాల్లో వాటిలో అభ్యర్థుల ఎంపికకు జాతీయ స్థాయిలో సివిల్స్ పరీక్ష నిర్వహిస్తారు. తొలి దశ ప్రిలిమ్స్ పరీక్షకు ఏటా లక్షల మంది అభ్యర్థులు పోటీపడతారు. ఈ ఏడాది 712 పోస్టులను భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్ అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో క్వాలిఫై అయితేనే మెయిన్స్ పరీక్ష ఉంటుంది. సివిల్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరు 200 మార్కులకు చొప్పున మొత్తం 400 మార్కులు ప్రిలిమనరీ పరీక్షకు కేటాయించారు. ఒక్కో పేపరుకు రెండు గంటల వ్యవధి ఉంటుంది.
Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే..
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..