TSPSC Group-1 Prelims Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఫలితాలపై కీలక ప్రకటన- వివరాలివే!
'గ్రూప్-1' ప్రిలిమ్స్ విషయంలో నెలకొన్న న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోయాయని, త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. మెయిన్ పరీక్షకు 25 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తెలంగాణలో 'గ్రూప్-1' ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ప్రిలిమ్స్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. 'గ్రూప్-1' ప్రిలిమ్స్ విషయంలో నెలకొన్న న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోయాయని, త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. మెయిన్ పరీక్షకు 25 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీని డిసెంబరు 14న ఐఏఎస్ అధికారులు బుర్రా వెంకటేశం, నవీన్ మిత్తల్, వాకాటి కరుణలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ దశలో ఉన్నాయన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు మరొక రాష్ట్రంలో ఉన్నత కొలువులకు ఎంపికవడం ఆశ్చర్యంగా ఉండేదని, తెలంగాణలోనూ ఆ తరహా భయం ఉండేదన్నారు. ఇక్కడి కొలువులు వేరే రాష్ట్రాల అభ్యర్థులు దక్కించుకుంటారని భావించిన తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి 95 శాతం కొలువులు స్థానికులకే దక్కేలా చేసిందని వివరించారు.
తెలంగాణ ఉద్యమం, సీఎం కేసీఆర్ కృషితోనే ఇది సాధ్యమైందని సీఎస్ అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎదగాలని సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. యూనివర్శిటీలు విద్యార్థులకు పోటీపరీక్షల తర్ఫీదు ఇచ్చే విధంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్సలర్ల సమావేశంలో తాను చేసిన ప్రతిపాదనను... ఉస్మానియా యూనివర్శిటీ సాకారం చేసిందని హర్షం వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి మాట్లాడుతూ.. అన్ని విశ్వవిద్యాలయాల్లో సివిల్ సర్వీసెస్ అకాడమీలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్, టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొ.చింతా గణేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఎస్‌పీఎస్సీ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 502 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనుంది టీఎస్పీఎస్సీ. వీరంతా గత నెల రోజులుగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Also Read:
తెలుగు రాష్ట్రాల్లో 69 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, కేంద్ర మంత్రి ప్రకటన!
తెలుగు రాష్ట్రాల్లో 69,265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. 2021-22లో ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డిసెంబర్ 14న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..