TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ ఇంటి దొంగలు, పరీక్ష రాయడంలోనూ తెలివితేటలు! ఏంచేశారంటే?
పరీక్షలో అత్యధిక మార్కులు సాధిస్తే అనుమానం వస్తుందని, ఇలాగైతే అసలుకే ఎసరు వస్తుందని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంచి మార్కులు తెచ్చుకోవడంతో సరిపెట్టుకున్నారు..
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ మొదటి నుంచీ పక్కా పథకం ప్రకారమే నడుచుకున్నారు. వీరిద్దరూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. అయితే పరీక్షల అత్యధిక మార్కులు సాధిస్తే అనుమానం వస్తుందని, ఇలాగైతే అసలుకే ఎసరు వస్తుందని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంచి మార్కులు తెచ్చుకోవడంతో సరిపెట్టుకున్నారు. 103 మార్కులు తెచ్చుకున్న ప్రవీణ్.. OMR షీట్‌లో డబుల్ బబ్లింగ్ చేశాడు. దీంతో కావాలనే డిస్ క్వాలిఫై అయ్యాడు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు 20 మంది రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో షమీమ్, సురేష్, రమేష్‌లకు వందకుపైగా మార్కులు వచ్చాయి. షమీమ్‌కు అత్యధికంగా 127 మార్కులు వచ్చాయి. ఈ ముగ్గురూ ప్రవీణ్, రాజశేఖర్ ద్వారా ప్రశ్నపత్రాన్ని ముందుగానే పొందారన్న ఆరోపణపై సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షకు ముందే వీరికి ప్రశ్నపత్రం అందినందున.. వీరు 150కి 150 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే దొరికిపోతామన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ మార్కులు వచ్చేలా రాశారని పోలీసులు భావిస్తున్నారు.
కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరికైనా వందశాతం లేక అసాధారణ స్థాయిలో మార్కులు వస్తే.. వారిపై విచారణ చేయడంతోపాటు అవసరమైతే పోలీసులతోనూ దర్యాప్తు చేయిస్తారు. ఈ నిబంధన కమిషన్‌లో పనిచేస్తున్న ఆ ముగ్గురుకీ తెలుసు. వీరికి గరిష్ఠంగా మార్కులు వస్తే కమిషన్ అధికారులకూ అనుమానం వచ్చే అవకాశం ఉంది. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. కానీ వ్యక్తిగత వివరాలు నింపే OMR షీట్‌లో డబుల్ బబ్లింగ్ చేయడంతో అనర్హుడయ్యాడు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ప్రారంభానికి ముందే.. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఓఎమ్మార్ పత్రంలో నమోదు చేయించి, ఇన్విజిలేటర్ సంతకం చేస్తారు. ఎవరైనా ఇందులో తప్పులు చేస్తే గుర్తించి, ఆ పత్రం తీసుకొని మరొకటి ఇస్తారు. ప్రవీణ్ పరీక్ష రాయడానికి ముందే తప్పుగా నింపి ఉంటే ఇన్విజిలేటర్‌కు తెలిసిపోయేది. అప్పుడు ఇంకోటి ఇచ్చేవారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అంటే తొలుత ప్రవీణ్ ఓఎమ్మార్ షీట్ బాగానే నింపి ఉంటాడు. పరీక్ష పూర్తయ్యాక.. తనకు ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి.. అంతా అనుమానించే అవకాశం ఉందని భయపడి, తనకు తాను డిస్‌క్వాలిఫై అయ్యేలా ఓఎమ్మార్ షీట్‌లో మరోమారు బబ్లింగ్ చేసి ఉంటాడని భావిస్తున్నారు.
పోలీసులను బురిడీ కొట్టించేందుకే..
టీఎస్‌పీఎస్సీ టౌన్‌ప్లానింగ్ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఫిర్యాదుపై ప్రవీణ్, రేణుకలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాము ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీక్ చేశామని నమ్మించేందుకు వారు ప్రయత్నించారు. పట్టుకోగానే ఏఈ ప్రశ్నపత్రం లీక్ అయిందని ఒప్పుకోవడం ద్వారా సిట్ అధికారులు అక్కడితో ఆగిపోతారని నిందితులు భావించారు. అయితే తవ్వే కొద్దీ గ్రూప్-1తోపాటు మొత్తం నాలుగు పేపర్లు లీక్ అయినట్లు వెల్లడైంది. ఇక విచారణ సమయంలో ఎంత ప్రయత్నించినా ప్రవీణ్ నోరు మెదపలేదు. తనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా వచ్చాయన్న విషయాన్ని రాజశేఖర్ వెల్లడించలేదు. శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో పోలీసులే తెలుసుకున్నారు.
Also Read:
త్వరలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల షెడ్యూలు! ఇప్పటికే ప్రకటించిన పరీక్ష తేదీల్లోనూ మార్పులు?
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ నియామక పరీక్షల కొత్త షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని కమిషన్ వెల్లడించింది. అయితే... గ్రూప్-1తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!
రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇకపై ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాతపరీక్షలను వేగంగా నిర్వహించి, వెంటనే ఫలితాలు వెల్లడించే దిశగా.. ఆన్‌లైన్ విధానంవైపు అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నలనిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించనుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..