APPSC Group2: 'గ్రూప్-2'కు దరఖాస్తుల వెల్లువ, ఇప్పటికే 4 లక్షలు దాటిన అప్లికేషన్లు, గడువు పెంచడంతో భారీగా పెరిగే అవకాశం
APPSC: ఏపీలో 'గ్రూపు-2' ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. జనవరి 10 సాయంత్రానికి సుమారు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
APPSC Group2 Applications: ఏపీలో 'గ్రూపు-2' ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. జనవరి 10 సాయంత్రానికి సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 899 గ్రూపు-2 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 333, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు 446 మంది పోటీపడుతున్నారు. జనవరి 10తో ముగియాల్సిన గడువును జనవరి 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో దరఖాస్తు గడువు ముగిసేనాటికి అభ్యర్థుల సంఖ్య, ఉద్యోగాలకు పోటీ భారీగా పెరిగే అవకాశం ఉంది.
సాంకేతిక సమస్యలతో గడువు పొడిగింపు..
గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు గడువు జనవరి 10తో ముగియాల్సి ఉండగా.. ఆన్‌లైన్‌లో పంపడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్‌పై ఒత్తిడి పెరిగి అభ్యర్థులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. కొద్దిరోజుల నుంచే ఈ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జనవరి 17 వరకు పొడిగించారు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది.
షెడ్యూలు ప్రకారమే ప్రిలిమ్స్ పరీక్ష..
గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగించినప్పటికీ.. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ రాతపరీక్ష యథాతథంగా జరుగుతుందని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(OMR) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
* గ్రూప్-2 పోస్టులు
ఖాళీల సంఖ్య: 899
➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333
➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566
ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..
➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టుల
➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు
➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
➥ ఆడిటర్: 10 పోస్టులు
➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
➥ జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు