(Source: ECI/ABP News/ABP Majha)
Group 1 Exam Timings: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ టైమింగ్స్ మార్పు
TGPSC Group 1 Exam timings | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ టైమింగ్స్ మారాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కొత్త టైమింగ్స్ పై ప్రకటన చేసింది.
Telangana Group 1 Exam timings changed |హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేశారు. టీజీ పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ లను మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయని తెలిసిందే. తొలుత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
గ్రూప్ 1 మెయిన్స్‌కు 31,382 మంది క్వాలిఫై
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 9న టీజీపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు హాజరయ్యారు. 1:50 నిష్పత్తిలో ఈ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ జులై 7న విడుదల చేసింది. ఆ లెక్కన 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఆ అభ్యర్థులను టీజీ పీఎస్సీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ 2024 ఎగ్జామ్ షెడ్యూలు..
- అక్టోబర్ 21, 2024: జనరల్ ఇంగ్లిష్ (అర్హత సాధిస్తే చాలు)
- అక్టోబర్ 22, 2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
- అక్టోబర్ 23, 2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ)
- అక్టోబర్ 24, 2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
- అక్టోబర్ 25, 2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
- అక్టోబర్ 26, 2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
- అక్టోబర్ 27, 2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రెండు దఫాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినా, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియను సైతం పూర్తిచేయలేకపోయింది. దాంతో గత ఎన్నికల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపారు. రెండు పర్యాయాలు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినా, తప్పిదాలతో రెండు సార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు చేశారు. పేపర్లు లీకయ్యాయని ఒకసారి ఎగ్జామ్ రద్దు చేయగా, బయోమెట్రిక్ తీసుకోకుండా ఎగ్జామ్ నిర్వహించారని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం సహా పలు కారణాలతో మరోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసింది. పాత చైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయగా, అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం.