Telangana News: తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం - వారికి రూ.లక్ష ఆర్థిక సాయం
Telangana Schemes: సివిల్స్ అభ్యర్థులకు చేయూతనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది.
Rajiv Gandhi Civils Abhayahastham Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్స్ అభ్యర్థులకు చేయూతనిచ్చేలా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 'రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' (Rajiv Gandhi Civils Abhayahastham) పథకాన్ని ప్రజా భవన్‌లో శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరఫున సాయం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్ సాధించి మన రాష్ట్రానికే రావాలని.. ఐఏఎస్, ఐపీఎస్‌లు మన వారైతే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు.
'నిరుద్యోగుల బాధలు తెలుసు'
ఉద్యోగాల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. త్యాగాల పునాదులపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం. డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు. పరీక్షలు మాటిమాటికీ వాయిదా పడడం మంచిది కాదు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ - 2 పరీక్ష వాయిదా వేశాం. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9 లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్శిటీ
మరోవైపు, తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ వర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల విభాగం ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్శిటీలను పరిశీలించి.. స్కిల్ వర్శిటీ నమూనా ముసాయిదా తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఫార్మా, కన్‌స్ట్రక్షన్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్.. తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులు ప్రవేశపెడతారని అన్నారు. తొలి ఏడాది 2 వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారని వివరించారు.
Also Read: TGPSC Group 2 Exams: గ్రూప్-2 పరీక్ష వాయిదా, అధికారిక ప్రకటన విడుదల చేసిన టీజీపీఎస్సీ