Stay On DSC: హైకోర్టు 'స్టే'తో ఆందోళనలో బీఈడీ అభ్యర్థులు, ఫీజు కట్టి అప్లయ్ చేసిన వారి పరిస్థితి ఏంటీ?
AP DSCలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అర్హతలపై కోర్టు స్టే ఇవ్వడంతో.. ఇప్పటివరకు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోయిన బీఈడీ అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేకుండా పోయింది.
![Stay On DSC: హైకోర్టు 'స్టే'తో ఆందోళనలో బీఈడీ అభ్యర్థులు, ఫీజు కట్టి అప్లయ్ చేసిన వారి పరిస్థితి ఏంటీ? Stay on BED qualifications for SGT posts What is the situation of those who applied after paying the fee Stay On DSC: హైకోర్టు 'స్టే'తో ఆందోళనలో బీఈడీ అభ్యర్థులు, ఫీజు కట్టి అప్లయ్ చేసిన వారి పరిస్థితి ఏంటీ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/c6672cb37390eada2ba036b19d75214a1707270349923522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP DSC 2024: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి విడుదలచేసిన ఏపీ డీఎస్సీ-2024కు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్స్(SGT) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు 'స్టే' విధించిన సంగతి తెలిసిందే. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఈ నిర్ణయంతో డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులుగా మారనున్నారు.
ఇప్పటికే చాలా మంది బీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు చెల్లింపు గడువు కూడా ఫిబ్రవరి 21తో ముగియనుంది, ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు ఉంది. కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు దూరంగా పెట్టనున్నారు. అయితే ఇప్పటికే దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఫీజులను తిరిగి వాపసు చేయనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోయిన బీఈడీ అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేకుండా పోయింది.
ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులా? అని ప్రశ్నించిన కోర్టు
ఫిబ్రవరి 21న జరిగిన విచారణలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఒకానొక దశలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్‌టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని అభ్యర్థించారు. హాల్‌టికెట్లను ఫిబ్రవరి 22 నుంచి జారీచేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను 21కి వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇక బుధవారం (ఫిబ్రవరి 21న) విచారణ ప్రారంభంకాగానే.. స్టే విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
టీజీటీ అభ్యర్థుల టెట్ స్కోర్ నమోదుకు నేడు తుది గడువు
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్ స్కోర్ తాజా సమాచారాన్ని బుధవారం(ఫిబ్రవరి 21న) సాయంత్రంలోగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చినట్లు గురుకుల పాఠశాలల నియామక బోర్డు ఫిబ్రవరి 20న ఒక ప్రకటనలో తెలిపింది. గడువు ముగిసిన తరువాత ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని వివరించింది. అనంతరం 4,020 పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించనుంది.
సర్వర్ సమస్యలు..
డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన అభ్యర్థులు సర్వర్ సమస్య తలెత్తడంతో ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుండటంతో.. ఎక్కువ మంది ఫిబ్రవరి 20న దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సర్వర్ సమస్య తలెత్తి వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. హడావుడిగా ప్రకటన చేయడం, షెడ్యూల్ ఇవ్వడంతోనే ఈ తరహా సమస్యలు వస్తున్నాయని అభ్యర్థులు పలువురు వాపోతున్నారు. దరఖాస్తుకు వారం మాత్రమే గడుగు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
యధేచ్చగా ఆప్షన్ల మార్పు..
ఇదీకాక ఆన్‌లైన్ దరఖాస్తులో ఐచ్ఛికాలను తరచూ మార్పు చేస్తున్నారు. గతంలో టెట్ హాల్‌టికెట్ నంబరు ఇస్తే సరిపోయేది. కొత్తగా మార్కులు ఇవ్వాలనే ఐచ్ఛికం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన వారిలో కొందరు గతంలో టెట్ రాసినా మార్కులు వేయకుండానే దరఖాస్తులు సమర్పించారు. ఈ కొత్త ఐచ్ఛికం కారణంగా వారు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క గతంలో దరఖాస్తు చేసిన సమయంలో కొందరు అభ్యర్థులు పొరపాట్లు చేశారు. దీన్ని ఎడిట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అధికారులు అంగీకరించడం లేదు. మళ్లీ కొత్తగా రూ.750 ఫీజు చెల్లించి కొత్త దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెబుతుండటంతో ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)