Staff Nurse: నర్సింగ్ సిబ్బందికి హోదామార్పు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అక్టోబరు 6న విడుదల చేసింది.
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. నర్సింగ్ సిబ్బందికి మరింత గౌరవం తీసుకువచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని.. వివిధ హోదాల్లో పేర్లు మార్చుతూ ‘ఆఫీసర్లు’గా ఖరారు చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం(అక్టోబరు 6న) జారీచేసింది. ఈ హోదా మార్పు శనివారం (అక్టోబరు 7) నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై స్టాఫ్ నర్స్‌ను నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్ నర్స్‌ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్పులు చేసింది. వైద్యారోగ్యశాఖతోపాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. పబ్లిక్ హెల్త్ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టును యథాతథంగా ఉంచింది.
హోదా మార్పు పట్ల నర్సులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా హోదా మార్పు కోసం ఎదరుచూస్తున్న రాష్ట్ర నర్సింగ్ సమాజానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తీపికబరు అందించారని, తమ గౌరవాన్ని మరింత పెంచారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సీహెచ్‌సీ నర్సులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగ్గ ఫలితంగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని నర్సులు స్పష్టం చేశారు.
సమాచార శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ మేరకు ఆ శాఖలో 88 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల భర్తీకీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1384ను విడుదల చేసింది. ఆయా పోస్టులను పొరుగు సేవల పద్దతిలో నియమించాలని నిర్ణయించింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు గాను ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించినట్లు ఆర్థికశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వీటితోపాటు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి.