Andhra Pradesh News: ఆడపిల్లలకు చదువెందుకని హేళన, కట్ చేస్తే జర్మనీలో జాబ్ ఆఫర్స్.. మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్
Nara Lokesh | ఆడపిల్లలకు చదువు ఎందుకని హేళన చేశారని, ఇప్పుడు ఫారిన్ వెళ్తుంటే మా తల్లిదండ్రులు చాలా గర్వపడుతున్నారు అని జర్మనీలో నర్సింగ్ జాబ్ సాధించిన మైలారి వినోదిని, లాం దివ్య అన్నారు.

ఉండవల్లి: “విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం చేయాలి” అనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించిన గ్రామీణ యువత, ఇప్పుడు ఆ కలను నిజం చేసుకుంటున్నారు. సీడాప్ (CDAP), IES (Indo Euro Synchronization) సంస్థల ద్వారా ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ పొంది, పలువురు యువతీయువకులు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొందారు. రూపాయి ఖర్చు లేకుండా భాషా శిక్షణ, వసతి, ఆహారం కల్పించడం వల్ల తాము ఈ అవకాశాన్ని అందుకున్నామని తెలిపారు. ఈ మేరకు వారు తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు:
1. ఇది ప్రతి ఒక్కరికి గోల్డెన్ ఛాన్స్
“నా బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత, విజయవాడ భవానీపురంలోని సీడాప్ శిక్షణా కేంద్రంలో 8 నెలలు జర్మన్ భాషలో B2 స్థాయి శిక్షణ పొందాను. మా కుటుంబం దిగువ మధ్యతరగతి. ఉచిత శిక్షణ, హాస్టల్, ఆహార సదుపాయాల వల్ల ఏ ఖర్చూ లేకుండా నేర్చుకోవచ్చింది. ఇప్పుడు నెలకు రూ.2.70 లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగం పొందాను. ఇది నిజంగా జీవితాన్ని మార్చేసే అవకాశం. ఈ అవకాశాన్ని అందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, సీడాప్, IES కు ధన్యవాదాలు.” మైలారి వినోదిని (కపాడిపాలెం, నెల్లూరు జిల్లా)

2. ఇలాంటి అవకాశం కలలో కూడా ఊహించలేదు
“నర్సింగ్ పూర్తి చేసి పిన్నమనేని ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నప్పుడే దినపత్రికలో సీడాప్ శిక్షణ వివరాలు చూశాను. వెంటనే దరఖాస్తు చేసి 10 నెలల పాటు శిక్షణ పొందాను. జర్మన్ భాషలో B2 స్థాయికి శిక్షణ ఇచ్చారు. నా నాన్న రైతు. మేం ఐదుగురం అక్కాచెల్లెళ్లం. నన్ను చదివించడం వ్యర్థమన్నవాళ్లు ఇప్పుడు నేను విదేశానికి వెళ్లిపోతుంటే ఆశ్చర్యపడుతున్నారు. నా కల నిజమైంది. ఇది సాధ్యమయ్యేలా చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.” లాం దివ్య (చిన్నఅవుటపల్లి, కృష్ణా జిల్లా)

3. నర్సింగ్ చేసి విదేశాలకు వెళ్లడం నా కల
“కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ చేసి, స్థానిక ఆసుపత్రిలో పనిచేశాను. సీడాప్ శిక్షణ ద్వారా ఏడాదిపాటు భవానీపురంలోని SRTP ట్రైనింగ్ సెంటర్లో జర్మన్ నేర్చుకున్నాను. 22వ తేదీన నేను జర్మనీకి బయలుదేరుతున్నాను. నా కల నిజమవుతుంది. మా నాన్న చాలా సంతోషపడుతున్నారు. గ్రామీణ యువతకు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.” కనికె లోకేష్ (కల్లూరు, కర్నూలు జిల్లా)

4. పేదలకూ అంతర్జాతీయ ఉద్యోగాలు సాధ్యమే అని నిరూపిస్తా
“పేద కుటుంబం నుంచి వచ్చిన నేను, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం పొందుతున్నాను. ఇది గొప్ప గర్వకారణం. ట్రైనర్ శ్రీనిధి సహకారంతో జర్మన్ భాషలో ప్రావీణ్యం పొందాను. మా తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలన్నది నా లక్ష్యం. మంత్రి నారా లోకేష్ ని కలవడం ఎంతో ప్రేరణ కలిగించింది. నా తర్వాత తరం విద్యార్థులకు నేను మార్గదర్శకుడిగా ఉండాలనుకుంటున్నాను.” దెబ్బె శివరాజు (బోగోలు, కర్నూలు జిల్లా)

సీడాప్ శిక్షణ ఫలితంగా గ్రామీణ యువతకి విదేశాల్లో ఉద్యోగావకాశాలు
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన ఈ శిక్షణా పథకం ద్వారా నర్సింగ్ అభ్యాసకులు రూపాయి ఖర్చు లేకుండా, అంతర్జాతీయ స్థాయిలో తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఉచిత శిక్షణతో పాటు, ఆహారం, వసతి, పుస్తకాలు కూడా కల్పించడంతో పాటు జర్మన్ భాషలో B2 లెవల్ వరకు నేర్పిస్తున్నారు.






















