CAPF Job Details: కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఖాళీలు, రాజ్యసభకు వెల్లడించిన కేంద్రం
CAPF: కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో లక్షకు పైనే ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వం గత ఐదేళ్లలో 71,231 ఖాళీలను భర్తీ చేసినట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది.
Vacancies in CAPF: కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గడచిని 5 సంవత్సరాల్లో 71 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు తెలిపారు. మొత్తం ఖాళీల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, ప్రమోషన్లు, మరణాలు, కొత్త బెటాలియన్ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి కారణాల వల్ల ఏర్పడినవే అని ఆయన తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఖాళీల వివరాలు ఇలా..
దేశంలోని అక్టోబర్ 30 నాటికి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఏఆర్ విభాగంలో మొత్తంగా 1,00,204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిరలో సీఆర్‌పీఎఫ్‌లో అధికంగా 33,730 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్‌లో 31,782 ఖాళీలు ఉన్నాయి. ఇక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)లో 12,808, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)లో 9,861 పోస్టులు; సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్‌బీ)లో 8,646; అస్సాం రైఫిల్స్‌లో 3377 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
త్వరలోనే పోస్టుల భర్తీ..
యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటోందని నిత్యానంద రాయ్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు మెడికల్ టెస్టులకు సంబంధించిన సమయాన్ని తగ్గించడం, కానిస్టేబుల్ జీడీ కోసం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల కటాఫ్ మార్కులను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు ఆయన సమాధానమిచ్చారు.
100 రోజులు సెలవులపై..
కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేసే సిబ్బంది శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తోందని మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే సీఏపీఎఫ్ సిబ్బంది జీవిత సమతుల్యతను మెరుగుపరిచేలా ఏడాదిలో 100 రోజులు వారంతా కుటుంబంతో గడిపేలా మంత్రిత్వశాఖ కృషిచేస్తోందని ఆయన స్పష్టంచేశారు. 2020 నుంచి 2024 అక్టోబర్ వరకు 42,797 మంది సీఏపీఎఫ్, ఏఆర్ సిబ్బంది 100 రోజుల సెలవులు పొందారని గణాంకాలను నిత్యానంద రాయ్ రాజ్యసభకు తెలిపారు.
ALSO READ:
ఇండియన్ కోస్ట్ గార్డులో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
ఇండియన్ కోస్ట్ గార్డులో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 24లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఐదు దశల పరీక్షలు, ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.56,100 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..