JLM Paper Leak: తెలంగాణలో జేఎల్‌ఎం పేపర్ లీక్- రేపు విద్యుత్ సౌధ ముట్టడికి అభ్యర్థుల పిలుపు
తెలంగాణ విద్యుత్ శాఖ నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో గందరగోళం నెలకొంది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులు ఐదుగురుని అరెస్టు చేశారు. ఎగ్జామ్ రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ఈ మధ్య వేసిన నోటిఫికేషన్ల పరీక్షలు ప్రారంభమయ్యాయి. అప్లై చేసిన అభ్యర్థులంతా ఎలాగైనా జాబ్ కొట్టాలన్న సంకల్పంతో చదువుతున్నారు. ఇదై టైంలో మరికొందరు వక్రమార్గంలో ఉద్యోగాలు సంపాదించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలానే ట్రై చేసిన ఓ వ్యక్తి బండారం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్‌మెన్ పరీక్షను జులై 17న నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడంటూ ఓ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి చెప్పిన వివరాలు తెలిసిన పోలీసులు కంగుతిన్నారు. దీనంతటికీ విద్యుత్ శాఖ ఉద్యోగులే ప్రధాన పాత్ర పోషించారని వారి ద్వారానే తంతంగమంతా నడించిందని తేల్చారు రాచకొండ పోలీసులు.
జులై 17న నిర్వహించిన లైన్‌మెన్ పరీక్షలో శివప్రసాద్ అనే అభ్యర్థి హాజరయ్యాడు. అతను సిబ్బంది కళ్లుగప్పి పరీక్ష హాల్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. అంతే కాకుండా పరీక్ష ప్రారంభమైన కాసేపటికి బయటి నుంచి అతనికి సమాధానాలు రావడం మొదలైంది. దీన్ని గమనించిన పక్కనే ఉన్న అభ్యర్థులు విషయాన్ని ఇన్విజిలేటర్‌కు చేరవేశారు.
శివప్రసాద్‌కు బయట నుంచి సమాధానాలు వస్తున్నాయని గ్రహించిన పరీక్ష నిర్వహకులు పోలీసులను పిలిచి కేసు రిజిస్టర్ చేశారు. పోలీసులు తమ స్టైల్‌లో విచారిస్తే... అసలు బాగోతమంతా వెలుగు చూసింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికి ఏడీఈ ఫిరోజ్‌ఖాన్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సైదులు, సబ్ ఇంజనీర్ షేక్ శాజాన్‌లు బయట నుంచి సమాధనాలు చెప్పడం స్టార్ట్ చేశారు. మైక్రోఫోన్ సహాయంతో సమాధానాలు చేరవేశారు.
ఈ దందా ఒకరిద్దరితో తేలలేదు చాలా మంది ఉన్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యోగానికి ఐదు లక్షల చొప్పున వసూలు చేశారని తెలుస్తోంది. అడ్వాన్స్‌గా లక్ష రూపాలు వసూలు చేశారు నిందితులు. ప్రస్తుతం ఐదుగురుని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూనియర్ లైన్‌మెన్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టైన ఫిరోజ్‌ఖాన్‌పై గతంలో కూడా కేసులు ఉన్నట్టు తేలింది. అంబర్‌పేట్‌లో ఆయనపై కేసు రిజిస్టర్ చేసినట్టు వివరించారు. అతన్ని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంకా ఎంతమందికి ఈ ప్రశ్నాపత్నం చేరి ఉంటుందో అన్న అనుమానం అభ్యర్థుల్లో నెలకొంది. అందుకే పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం జూనియర్ లైన్‌మెన్ అభ్యర్థుల అధ్వర్యంలో ర్యాలీ తీస్తున్నారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడంచేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. జేఎల్‌ఎం పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌తోపాటు వారి జీవితాలతో ఆడుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.