(Source: ECI/ABP News/ABP Majha)
TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన
గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో 'ఆప్షన్లు' ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు తెలిపింది.
తెలంగాణలో గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు గురుకుల నియామక బోర్డు కీలక సూచనలు చేసింది. గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో 'ఆప్షన్లు' ఇచ్చుకోవాల్సిందిగా బోర్డు తెలిపింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఆప్షన్లు ఇస్తేనే నియామకాల భర్తీలో నిలిచేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దక్కేందుకు అవకాశాలు ఉంటాయని బోర్డు వెల్లడించింది.
గురుకుల ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), స్కూల్ లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు అన్ని 'ఆప్షన్లు' ఇస్తేనే దరఖాస్తు ముందుకు వెళ్తుందని, లేకుంటే నిలిచిపోతుందని స్పష్టం బోర్డు స్పష్టం చేసింది. గురకుల పరీక్షలకు హాజరైన టీజీటీ అభ్యర్థులు సెప్టెంబరు 30లోగా, మిగతా పోస్టులకు అక్టోబరు 3 నుంచి 9 లోగా ఆప్షన్లను నమోదు చేయాలని బోర్డు కోరింది.
సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇప్పటికే సీబీఆర్‌టీ పరీక్షలు పూర్తిచేసి, తుదికీ, అభ్యర్థుల జవాబుపత్రాలను వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరిచింది. 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేసిన తరువాతే సొసైటీల వారీగా ఐచ్ఛికాలు తీసుకోవాలంటూ కొందరు ఉద్యోగార్థులు వ్యక్తం చేసిన సందేహాలపై బోర్డు వివరణ ఇచ్చింది.
గురుకుల పోస్టులకు సంబంధించి.. డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, కళాశాలల్లో లైబ్రేరియన్లు, పీడీలకు దరఖాస్తు సమయంలోనే బోర్డు ఐచ్ఛికాలు తీసుకుంది. ఇవన్నీ మల్టీజోనల్ పోస్టులు కావడంతో ఐచ్ఛికాల సంఖ్య తక్కువగా ఉంది. ఒక్కో పురుష అభ్యర్థి 10 ఆప్షన్లు, మహిళా అభ్యర్థులు మహిళా కళాశాలలతో కలిపి 20 ఐచ్ఛికాలు ఇచ్చారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పాఠశాలల లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులన్నీ జోనల్ పోస్టులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో పురుష అభ్యర్థి 35 ఐచ్ఛికాలు, మహిళా అభ్యర్థి 70 ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాలు తీసుకుంటే సాంకేతికంగా దరఖాస్తుపై తీవ్ర ప్రభావంతో పాటు అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని తీసుకోలేదు. పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం సొసైటీలు, జోన్లవారీగా ఐచ్ఛికాలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. గత నియామకాల్లో అభ్యర్థులు కొన్ని సొసైటీలను ఐచ్ఛికాలుగా పెట్టుకున్నందున పోస్టులు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి అన్ని సొసైటీలు, అన్ని జోన్లకు ఐచ్ఛికాలు తప్పనిసరి చేయడం ద్వారా ప్రతిభ ఉన్న అభ్యర్థులు పోస్టులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బోర్డు పేర్కొంది.
నెలాఖరుకు గురుకుల డీఎల్ అభ్యర్థుల జాబితా..
గురుకుల డిగ్రీ పోస్టులకు ఈనెలాఖరు నాటికి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు వెల్లడించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు డెమో తరగతులు ఉన్నాయి. జనరల్ మెరిట్ ర్యాంకు జాబితా విధానం కింద మార్కులు వెల్లడిస్తే సాంకేతిక సమస్యలు వస్తాయని బోర్డు ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో డెమో తరగతులున్న పోస్టులకు జనరల్ ర్యాంకు జాబితా వెల్లడించకూడదని భావిస్తోంది. డెమో తరగతులు లేని పోస్టులపై ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.