తెలంగాణలో 10 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేది అప్పుడే?
త్వరలోనే 10 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 వేల నుంచి 15 వేల వరకు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
➥ ఏప్రిల్‌లో ముగియనున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ
➥ మే నెలలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం!
➥ 10 వేల నుంచి 15 వేల టీచర్ పోస్టుల భర్తీ?
తెలంగాణలో త్వరలో మరో భారీ ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల స్వీకరణ, సీనియారిటీ లిస్టు తదితర ప్రక్రియ నడుస్తోంది. 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లకు కూడా సాధారణ బదిలీల్లో అవకాశమివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వారి నుంచి కూడా ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ మొత్తం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి వరకు కొనసాగనుంది.
బదిలీ అయిన ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేసే పాఠశాల నుంచి కొత్త చోటుకి బదిలీ అయిన స్కూల్‌కు ఏప్రిల్ 24న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు పాత స్కూల్‌ల్లోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు, సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఉపాధ్యాయ ఖాళీల లెక్కతేల్చిన తర్వాతే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చెయనున్నారు. ఏప్రిల్‌ల్లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగియనుండటంతో మే నెలలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
10 వేల నుంచి 15 వేల వరకు టీచర్ పోస్టులు..
చాలా కాలం తర్వాత టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ తర్వాత మెగా డీఎస్సీ లేదా టీఆర్టీ ఉంటుందని బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం టీచర్ పోస్టుల ఖాళీలను కూడా ప్రకటించింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు 13 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. టీచర్ల హేతుబద్ధీకరణ తర్వాత మరో ఐదు వేలకుపైగా ఖాళీలు ఏర్పడనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో త్వరలోనే 10 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో 10 వేల నుంచి 15 వేల వరకు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టీచర్ పోస్టుల నియామక ప్రక్రియను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ)కి అప్పగిస్తారా లేదా టీఎస్‌పీఎస్‌సీకి అప్పగిస్తారా అనే అంశంపై ఇంకా ఇంత వరకు విద్యాశాఖ ఒక పూర్తి స్పష్టతకు రాలేదు. సీఎస్‌గా సోమేష్ కుమార్ ఉన్నప్పుడు డీఎస్సీకే మొగ్గుచూపినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం సీఎస్‌గా శాంతికుమారి ఉండడంతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు.. రాష్ట్రంలో గ్రూప్-1, 2, 3, 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఇతర విభాగాల్లోని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు ఇప్పటికే వెలువడ్డాయి. దాదాపు అన్ని రకాల నోటిఫికేషన్లు వెలువడడమే కాకుండా వాటి నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గ్రూప్-1, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ ఇప్పటికే తుదిదశకు కూడా చేరుకుంది. ఇక మిగిలింది ముఖ్యమైన ఒకే ఒక నోటిఫికేషన్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్. ఎంతో మంది అభ్యర్థులు తమ ఆశల కొలువుగా చెప్పుకునే ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు దీనికోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నారు.
Also Read:
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్: మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరునాటికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ! - మంత్రి సబితా
తెలంగాణలో మరో ఉద్యోగాల జాతరకు త్వరలోనే సైరన్ మోగనుంది. రాష్ట్రంలో త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..