PGT Certificate Verification: పీజీటీ పోస్టులకు ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన
తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో ఎంపికైన వారికి ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది.
PGT Posts Certificate Verification: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 1,276 పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాల్లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. సబ్జెక్టుల వారీగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన వివరాలు, అర్హత పొందిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలంటూ బోర్డు అధికారులు వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌లు పంపించడంతోపాటు వారికి ఫోన్లు చేసి సమాచారమిచ్చారు. మరోవైపు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లోని ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్, పాఠశాలల్లోని ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు శనివారం నుంచి డెమో తరగతులు నిర్వహించేందుకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది.
సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించే వేదికలు..
➥ పీజీటీ హిందీ పోస్టులకు ఫిబ్రవరి 10న ఉదయం 9 గంటల నుంచి ఎల్బీనగర్(మెట్రోపిల్లర్ 1570) ఎస్సీ గురుకుల మహిళా న్యాయకళాశాల ఆవరణలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
➥ పీజీటీ సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్ పోస్టులకు ఫిబ్రవరి 11న ఉదయం 9 గంటల నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.10లోని బంజారాభవన్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
➥ పీజీటీ తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు ఫిబ్రవరి 11న ఉదయం 9 గంటల నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.10లోని కుమురంభీం ఆదివాసీ భవన్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
డెమో తరగతులకు ఏర్పాట్లు...
ఫలితాలు ప్రకటించిన పోస్టుల్లో డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పీడీ, లైబ్రేరియన్, పాఠశాలల్లో పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. మాసబ్ ట్యాంక్ సంక్షేమభవన్ ఆవరణలో ఆ తరగతుల నిర్వహణకు సంక్షేమ శాఖలు అవసరమైన సదుపాయాలు కల్పించాయి. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్టులకు 10, 11 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెమో తరగతులు పూర్తయిన తర్వాత ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కిందిస్థాయి పోస్టుల వరకు ప్రాధాన్యత క్రమంలో తుది ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. తద్వారా గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలకు అవకాశం లేకుండా చేయాలనేది బోర్డు లక్ష్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడుషిప్టుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామకబోర్డు నిర్వహించింది. వీటికి సగటున 75.68 శాతం మంది హాజరయ్యారు. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేస్తుంది.