TS Universities: తెలంగాణ వర్సిటీలకు వీసీల నియామకం, ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం!
తెలంగాణలోని యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతుల నియామకానికి మార్గం సుగమమైంది. నియామకాలకు సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేయడంతో ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Vice chancellor posts of telangana universities: తెలంగాణలోని యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతుల (Vice chancellors) నియామకానికి మార్గం సుగమమైంది. నియామకాలకు సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 23న సంతకం చేశారు. ఈ ఫైల్ విద్యాశాఖకు చేరడంతో.. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలనకు పంపిస్తారు. ఈ సెర్చ్ కమిటీ ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ఎంపికచేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు పంపిస్తుంది. గవర్నర్ ఆమోదించిన తర్వాత.. వీసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి. మే నెలాఖరునాటికి ఈ ప్రక్రియంతా పూర్తిచేసి.. పాత వీసీలు వైదొలగగానే కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈ యూనివర్సిటీలకు కొత్త వీసీలు..
రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ, జేఎన్‌ఎఫ్‌ఏయూ వర్సిటీల వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే నెలతో ముగియనుంది. ఇక జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి పదవి కాలం ముగియగా, ప్రస్తుతం ఇన్‌చార్జ్ వీసీ కొసాగుతున్నారు. ఇక హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీ వీసీల కాలపరిమితి జనవరితో ముగియనుంది. బాసర ఆర్జీయూకేటీకి ఇన్‌చార్జీ వీసీ కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా గతేడాది జూన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆయనను పదవి నుంచి తప్పించారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇన్‌చార్జీ వీసీగా వ్యవహరిస్తున్నారు. అటవీ విశ్వవిద్యాలయం (FCRI), మహిళా వర్సిటీ(కోఠి)లు ఇటీవలే ఏర్పడటంతో వీటికి కొత్తగా వీసీలను నియమించాల్సి ఉంది. అయితే ఈ రెండింటికి సెర్చ్ కమిటీతో నిమిత్తం లేకుండానే వీసీలను నియమించే వెసులుబాటు ఉన్నది.
సెర్చ్ కమిటీ ద్వారా ఎంపిక..
వీసీల ఎంపిక ప్రక్రియను సెర్చ్ కమిటీలు చేపడుతాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో వర్సిటీకి ముగ్గురితో సెర్చ్ కమిటీ ఏర్పడుతుంది. వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేస్తుంది. ప్రభుత్వ నామిని, యూజీసీ చైర్మన్ నామిని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) నామినీలతో ఈ సెర్చ్ కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ సమావేశమై అందరి బయోడేటాలను పరిశీలించి, ముగ్గురు పేర్లను వీసీగా నియమించేందుకు సూచిస్తారు. కనీసం ప్రొఫెసర్ 10 సంవత్సరాలుగా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదేండ్ల అనుభవం కలిగి ఉండాలి. వీసీని మూడేండ్ల కాల పరిమితికి నియమిస్తారు. కాల పరిమితి ముగియగానే వైదొలగాల్సి ఉంటుంది.
పాతపద్ధతిలోనే ఫ్యాకల్టీల భర్తీ..
రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి తలపెట్టిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు’ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. పాత పద్ధతిలోనే వర్సిటీ రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఏ యూనివర్సిటీ పరిధిలోని పోస్టులను ఆయా వర్సిటీలే నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీచేస్తాయి. ఆయా పోస్టుల భర్తీకి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ విధానంలో నియామకాలను పూర్తిచేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఉపసంహరణకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో ఈ బిల్లు ఉపసంహరణకు రాజ్‌భవన్‌తో సీఎంవో, విద్యాశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.