By: ABP Desam | Updated at : 12 Aug 2022 11:13 PM (IST)
శ్రీలంక సంక్షోభం
Sri Lanka economic crisis: ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచి ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడంతో శ్రీలంకలో సంక్షోభం తాలూకు సంకేతాలు కనిపించాయి. చక్కెర, బియ్యం వంటి నిత్యావసరాలను గతేడాదితో పోలిస్తే రెట్టింపు ధరలకు అమ్మడం మొదలైంది. ఏప్రిల్ మొదటి వారంలో దేశ రాజధాని కొలంబోని ఇంధన స్టేషన్ల వద్ద పెట్రోలు, డీజిల్ కోసం ప్రజలు భారీగా క్యూ కట్టారు. అనూహ్యంగా ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూను ప్రకటించడంతో పరిస్థితి తీవ్రత మొదటిసారిగా ప్రజలకు తెలిసింది. కానీ మరుసటి రోజు నుంచే ప్రజలు గ్యాస్ స్టేషన్ల వద్దకు రావడంతో నిరసన సెగలు మొదలయ్యాయి.
రెండు రోజుల తర్వాత గాలే సముద్రతీరంలోని అధ్యక్ష భవనం ముందు ప్రజలు చిన్న చిన్న గూడారాలు వేసి నిరసనలు మొదలు పెట్టారు. ఇవి దేశవ్యాప్తంగా పాకడంతో రాజపక్సే ప్రభుత్వం నియత్రణ కోల్పోయింది. 2005 నుంచి ఆ కుటుంబం అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షంలోనే ఉండటం గమనార్హం. ఐదేళ్ల విరామం తర్వాత రాజపక్సే కుటుంబం 2019 సార్వత్రిక ఎన్నికలలో గెలిచింది. మహింద రాజపక్సే ప్రధాని, సోదరుడు గోటబయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రభుత్వంలో ఇతర కీలక పదవులూ కుటుంబ సభ్యులకే పంచారు. ఇదే వారి పాలిట శాపంగా మారింది. కొన్నేళ్లుగా లంకను పరిపాలించిన ఆ కుటుంబం ప్రజల ఆందోళనతో దేశం వదిలి పారిపోయింది. ఒకప్పుడు ఎల్‌టీటీఈని నాశనం చేసింది వీరే.
శ్రీలంక సంక్షోభం - ఎలా మొదలైంది?
కొలంబో హోటల్‌లో 2019 ఈస్టర్ ఆదివారం బాంబు పేలుళ్లతో శ్రీలంక రాజపక్స కుటుంబ ప్రజాదరణ పతనమవ్వడం మొదలైంది. ఈ తీవ్రవాద దాడిలో వందలాది మంది మరణించారు. మరెంతో మంది వికలాంగులుగా మారారు. దీనికి తోడు కొవిడ్ మొదలైంది. మొత్తంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలకు కీలకమైన శ్రీలంక పర్యాటక రంగం దెబ్బతింది. ఉద్యోగాలు పోవడం దెబ్బ మీద దెబ్బగా మారింది. ఇదే సమయంలో రాజపక్స ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం లంకను నాశనం చేసింది. సేంద్రియ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో రసాయనాలు, పురుగు మందులను నిషేధించింది. ఆరు నెలల్లో ధాన్యం ఉత్పత్తి దాదాపు 43% తగ్గింది. విదేశీ ఎగుమతుల ఆర్జన 15% తగ్గింది. హడావుడిగా ఈ పాలసీ రద్దు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పర్యాటకం తిరోగమనం, కోవిడ్-19, ఎరువుల నిషేధం శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయాయి. ఇంధనం నుంచి బియ్యం వరకు దిగుమతి చేసుకొనేందుకు డాలర్లు కరవయ్యాయి. ఒకప్పుడు శ్రీలంక తలసరి ఆదాయం భారత్ కన్నా ఎక్కువుండేది. ప్రభుత్వ నిర్ణయాలతో ఇదంతా నాశనమైంది. ఈ ద్వీప దేశం నాలుగు దశాబ్దాలలోనే ఘోరమైన ఆర్థిక సంక్షోభానికి గురైంది. విద్యుత్ కోతలతో కొలంబోలోని ఆసుపత్రులల్లో శస్త్ర చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది.
ప్రజలు తమ దుస్థితికి రాజపక్సే కుటుంబాన్ని నిందించారు. కొలంబోలో నిరసనలు పూర్తి స్థాయి తిరుగుబాటుగా మారాయి. ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు గుంపులుగా చేరి అధికార పార్టీ శాసనసభ్యులపై దాడి చేశారు. అధ్యక్ష భవనానికి నిప్పు పెట్టారు. గోటాబయ రాజపక్సే తన బద్ధ శత్రువైన రణిల్ విక్రమసింఘేకు పగ్గాలు అప్పగించి నౌకలో దేశం విడిచి పారిపోయారు. అయినప్పటికీ ప్రజలు శాంతించలేదు. ప్రస్తుత పాలక వర్గం విక్రమసింఘేతో ఒప్పందాలు కుదుర్చుకుందని వ్యతిరేకిస్తున్నారు.
విక్రమ సింఘే పరిస్థితి ఏంటి?
లంక రాజకీయాల్లో విక్రమసింఘే సుదీర్ఘ కాలంగా ఉన్నారు. ప్రధానిగా చేశారు. అధ్యక్షుడు కావాలన్నది ఆయన చిరకాల వాంఛ. ఇలాంటి కష్ట కాలంలో ఆయన అధ్యక్షుడు కావడం విడ్డూరం! కొత్త అధ్యక్షుడిగా ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. విదేశీ రుణాలు చెల్లించలేక దేశం ఇప్పటికే దివాలా తీసింది. రెండు దశాబ్దాలలో ఆసియా-పసిఫిక్‌లో దివాలా తీసిన మొదటి దేశం ఇదే.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి 3-బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ పొందే ప్రయత్నాలు నెల పాటు ఆలస్యమైంది. బహుశా సెప్టెంబరులో రుణం లభించొచ్చు. చెల్లింపుల్లో సమతూకం కోసం సంక్షోభం అదుపులోకి వచ్చే వరకు ఇంధనం రేషన్ చేయడం కొనసాగుతుంది. ఈ లోగా విక్రమసింఘే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలి. మరోవైపు పాలక వర్గంపై ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చాలి. శాంతిభద్రతలను పరిరక్షించాలి.
నిత్యావసర ధరలను తగ్గించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రజలకు మేలు చేయడాన్ని బట్టి విక్రమసింఘే ఎంతకాలం పదవిలో కొనసాగుతారన్నది తెలుస్తుంది. మొత్తంగా లంక సంక్షోభం పశ్చిమాసియాలో పదేళ్ల క్రితంనాటి అరబ్ వసంతాన్ని గుర్తుకు తెస్తోంది. ఏదేమైనా విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడుగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. సుదీర్ఘ ప్రణాళికతో వచ్చినట్టే అనిపిస్తోంది.
కేవలం హిందీ, ఇంగ్లీషే అంటే - మిగతా రాష్ట్రాల సంగతేంటి?: కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే పార్టీలకు కమిట్మెంట్ ఉండాలి - కవిత ఇంటర్యూ తీసుకున్న రష్యా పత్రిక !
Indian Navy Chief Hari Kumar: మాకు రాఫెల్, F/A-18లలో ఏదైనా ఓకే - తుది నిర్ణయం కేంద్రానిదే: ఏబీపీతో నేవీ చీఫ్
ENG vs NZ Test 2023: వారెవ్వా కివీస్- ఇంగ్లండ్ తో రెండో టెస్టులో ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం
Train Food Whatsapp : ట్రైన్ లో లాంగ్ జర్నీనా - ఈ ఫోన్ నెంబర్ మీ ఆకలి తీర్చేస్తుంది !
/body>