ఈ మధ్య చెమట వాసన ఎక్కువైందా? డయాబెటిస్ కావచ్చు, జాగ్రత్త!
షుగర్ వల్ల శరీరంలో దుర్గందం పెరుగుతుందా అంటే అవునని అంటున్నారు వైద్యులు. అలా ఎందుకు పెరుగుతుంది? కారణాలు ఏమిటీ?
లైఫ్ స్టైల్ వ్యాధుల్లో ముఖ్యమైంది షుగర్ అని ముద్దుగా పిలుచుకునే డయాబెటిస్. దీన్ని ఎంత త్వరగా గుర్తించి జాగ్రత్త పడితే నష్టాన్ని అంత తగ్గించే అవకాశం ఉంటుంది. రకరకాల కారణాలతో ఈ రోజుల్లో ఈ సమస్య బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. మారిన జీవన విధానం వల్ల ఈ మధ్య యువకుల్లో సైతం ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే దీన్ని గుర్తించేందుకు కనిపించే అన్ని లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటూ అనుక్షణం గమనించుకుంటూ ఉండడం అవసరం.
ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన శారీరక వాసన కలిగి ఉంటారు. ఇది వారి శరీరం మీద ఉన్న బ్యాక్టీరియా, చెమట వల్ల ఏర్పడుతుంది. ఇది శరీరంలో హార్మోన్లు, ఆహార అలవాట్లు, ఇన్ఫెక్షన్లు, వాడుతున్న మందులు వంటి అనేక అంశాల మీద ఈ వాసన ఎక్కువ తక్కువలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇందుకు డయాబెటిస్ కూడా ఒక కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం నుంచి వెలువడే వాసనలో మార్పు వచ్చినట్టు గుర్తిస్తే వెంటనే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం అవసరం అని డాక్టర్లు అంటున్నారు. ఇలా త్వరగా గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభిస్తే డయాబెటిస్ వల్ల శరీరంలోని గుండె, రక్తనాళాలు, కిడ్నీల వంటి ఇతర ముఖ్యమైన అవయవాలకు నష్టం వాటిల్లకుండా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది.
డయాబెటిస్ తో బాధపడుతున్నవారిలో శరీర వాసనలో గుర్తించగలిగేంత మార్పు వస్తుందని డాక్టర్లు అంటున్నారు. శరీరంలో కీటోన్ లెవెల్స్ పెరిగినపుడు రక్తంలో ఆమ్ల గుణం పెరుగుతుంది. అందువల్ల చెమట ఒక రకమైన తియ్యని వాసన వస్తుంది. ఈ వాసన షుగర్ లెవెల్స్ పెరిగాయనడానికి సంకేతం కావచ్చు. మీ రక్తంలో షుగర్ స్థాయి 240 ఎంజీ/డిఎల్ అంత కంటే ఎక్కువ నమోదయితే శరీరంలో కీటోన్ల స్థాయిని నిర్థారించే రక్త లేదా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాదు కీటో అసిడోసిస్ లక్షణాలు కనిపించినపుడు కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలి.
ఎందుకు శరీరం దుర్వాసన వస్తుంది?
డయాబెటిస్ తో బాధపడుతున్న వారిలో ఇన్సులిన్ తగినంతగా లేకపోవడం వల్ల రక్తంలో కలిసిన గ్లూకోజ్ శరీర కణాల్లో చేరి శక్తిగా మారదు. లివర్ లో కొవ్వులు విడిపోయి ఆమ్లాలుగా మారుతాయి. వీటినే కీటోన్స్ అంటారు. ఈ క్రియ ఎక్కువ మొత్తంలో జరిగితే శరీరంలో కీటోన్ల నిల్వలు ప్రమాదకర స్థాయికి పెరిగిపోతాయి. ఇవి రక్తంలో, మూత్రంలో చేరడం వల్ల అమ్ల లక్షణం పెరుగుతుంది. ఇలా ఎక్కువైన కీటోన్లు శ్వాస ద్వారా , చెమట ద్వారా బయటకు విసర్జితం అవుతాయి. శరీరంలో కీటోన్ల స్థాయి అదుపు తప్పితే శరీరంలో పండు వంటి దుర్గందం రావడం, శ్వాసలో దుర్గంధం, వాంతులు, కడుపులో వికారంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దుర్గందాన్ని నివారించడం ఎలా?
- తరచుగా రక్తంలో షుగర్ స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి. అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సి న జాగ్రత్తలు తప్పక పాటించాలి.
- వర్కవుట్ మరవొద్దు
- బ్యాలెన్స్డ్ డైట్ తప్పనిసరి
- తాజా కూరగాయాలు, ఒక పరిమితిలో పండ్లు తప్పక తీసుకోవాలి
- అవసరమైన మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి
- శరీరంలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటిని ఎప్పటికప్పుడు డాక్టర్ తో చర్చిస్తూ ఉండాలి.
Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు