World AIDS Day 2023 : పులిరాజా ఇప్పుడు సురక్షితమేనా? ఎయిడ్స్‌ను ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేమిటీ?
HIV Treatment in Telugu : ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. దాని రోగ నిర్ధారణ ఎలా చేయాలి? దానికి ఏమైనా చికిత్సలున్నాయా?
AIDS Treatment in Telugu : పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? అంటూ ఒకప్పుడు హెచ్ఐవీపై పెద్ద ప్రచారమే చేశారు. ఈ వినూతన ప్రచారం వల్ల ఎంతోమందికి ఎయిడ్స్‌పై అవగాహన కలిగింది. అయితే, ఒకప్పుడు ఈ వ్యాధికి చికిత్స ఉండేది కాదు. ఈ వ్యాధి సోకితే సమాజం కూడా రోగులను దూరం పెట్టేది. వాళ్లను చూడాలంటేనే జనాలు వణికిపోయేవారు. మరి, ఎయిడ్స్ అంటే ఇప్పటికీ అదే భయం ఉందా? ఈ వ్యాధికి ఇప్పుడు చికిత్స ఉందా? దీన్ని ఎలా గుర్తించాలి? వరల్డ్ ఎయిడ్స్ డే (World AIDS Day 2023) నేపథ్యంలో ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలు మీ కోసం.
HIV లేదా AIDS. ఇది దీర్ఘాకాలిక, ప్రాణాంతకమైన వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 39 మిలియన్ల మంది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్‌తో ఇబ్బందిపడుతున్నారు. ఇది మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురించేసే విషయం. ఈ నేపథ్యంలో దీని గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. అసలు ఎయిడ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి? దీనికి చికిత్సలున్నాయా? ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్ఐవీ రావడానికి గల కారణాలు..
హెచ్ఐవీ లేదా ఎయిడ్స్‌కు ప్రధాన కారణం అసురక్షితమైన సెక్స్. కండోమ్‌లు వినియోగించకుండా.. లైంగిక సంపర్కంలో పాల్గొనడం వల్ల ఇది వస్తుంది. ఈ వైరస్ వీర్యంలో, యోని ద్రవాల్లో, రక్తంలో ఉంటుంది. శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి జరుగుతుంది. రక్తమార్పిడి, అవయవ మార్పిడి, అసురక్షితమైన వైద్య విధానాల వల్ల హెచ్ఐవీ ప్రసారమవుతుంది.
వైరస్ ఉన్న వ్యక్తికి వినియోగించిన ఇంజెక్షన్లు మరొకరికి ఉపయోగించడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వైరస్ సంక్రమిస్తుంది. తల్లికి ఎయిడ్స్ ఉన్నట్లయితే.. ప్రసవ సమయంలో లేదా తల్లి పాలివ్వడంలో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి నిర్ధారణ
హెచ్ఐవీ, ఎయిడ్స్ నిర్ధారణకు కొన్ని నిర్దిష్ట పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాల గురించి వైద్యులు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి శారీరక పరీక్షలు చేస్తారు. డాక్టర్ హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తిస్తే.. కొన్ని సాధారణ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
హెచ్ఐవీ యాంటీ బాడీ టెస్ట్
ఈ టెస్ట్ కోసం రక్తం, లాలాజలం సేకరిస్తారు. ఈ టెస్ట్‌లో హెచ్ఐవీ సంక్రమణకు ప్రతిస్పందనగా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేసిన ప్రతిరోధకాలు గుర్తిస్తారు. దీని ఫలితాలు రావడానికి కొన్ని రోజుల నుంచి వారాలు వరకు సమయం పట్టవచ్చు.
యాంటిజెన్ టెస్ట్
దీని ద్వారా మీ శరీరంలో యాంటీబాడీస్, వైరల్ యాంటిజెన్‌ను గుర్తిస్తారు. దీని ఫలితాలు త్వరగానే వస్తాయి.
న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్
ఇది వైరస్‌ను నేరుగా గుర్తించే బ్లెడ్ టెస్ట్. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు.. ప్రారంభ దశలోనే గుర్తించడానికి సహాయం చేస్తుంది. CD కౌంట్, వైరల్ లోడ్ టెస్ట్ వంటి టెస్ట్‌లు కూడా హెచ్ఐవీని గుర్తించడంలో హెల్ప్ చేస్తాయి.
ఎయిడ్స్‌కు చికిత్స ఉందా?
హెచ్ఐవీ, ఎయిడ్స్ నయం కానీ ఓ దీర్ఘకాలిక వ్యాధి. కానీ జీవనశైలిలో మార్పులు.. మెడిసిన్‌తో దీనిని కంట్రోల్ చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటో.. వాటితో ఎలా దీనిని కంట్రోల్ చేయవచ్చో తెలుసుకుందాం.
యాంటీ రెట్రో వైరల్ థెరపీ
ఈ చికిత్సలో భాగంగా వైరల్ రెప్లికేషన్ను తగ్గిస్తారు. వ్యాధి పురోగతిని నెమ్మది చేయడానికి, రోగనిరోధక వ్యవస్థను కాపాడేందుకు ఇది సహాయం చేస్తుంది. ఇది మూడు లేదా అంతకంటే ఎక్కువ యాంటీ రెట్రో వైరల్ ఔషదాలతో నిండి ఉంటుంది. దీనిని వ్యాధి సోకిన వ్యక్తికి అందించి.. వైరస్ ప్రభావాన్ని కంట్రోల్ చేస్తారు.
కాంబినేషన్ థెరపీ
హైలీ యాక్టివ్ యాంటీ రెట్రో వైరల్ థెరపీనే కాంబినేషన్ థెరపీ అంటారు. ఇది వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. వైద్యులు సూచించిన మందులను జీవితాంతం వాడుతూనే ఉండాలి. ఇది మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. త్వరగా తగ్గిపోవాలని మోతాదుకు మించి తీసుకుంటే అసలుకే మోసం అవుతుంది. అలాగే చికిత్స ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి CD4 సెల్ కౌంట్ చేయించుకోవాలి. ఇది దుష్ప్రభావాలను దూరం చేసి.. మెరుగైన వైద్యాన్ని తీసుకోవడంలో సహాయం చేస్తుంది.
జీవన శైలిలో మార్పులు
ఎయిడ్స్ ప్రభావం ప్రధానంగా రోగనిరోధక శక్తిపై పడుతుంది. కాబట్టి మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోగనిరోధక శక్తిని పెంచే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామం చేయాలి. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మానసిక స్థితని మెరుగుపరచుకునేందుకు ధ్యానం లేదా యోగా చేయండి. ఇది రోగనిరోధక శక్తిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. వీటితో పాటు తగినంత నిద్రపోండి. రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే మీరు కంటి నిండా నిద్రపోవాల్సి ఉంటుంది. అలాగే టీకాలు తీసుకోండి. ఇవి మీపై వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తాయి కానీ.. పూర్తిగా నయం కాదనే విషయం గుర్తించాలి.
Also Read : మీ శరీరంలో ఈ మార్పుల సంకేతం అదే.. అస్సలు అశ్రద్ధ చేయకండి
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply