Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Diet for Kidney : క్రియాటినిన్ రక్తంలో పెరిగితే కిడ్నీలకు ప్రమాదం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా క్రియాటినిన్ నిల్వలను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Diet Tips : ఈ మధ్యకాలంలో వైద్యులు ఎక్కువగా ‘క్రియాటినిన్’ పరీక్ష చేయించుకోమని సిఫార్సు చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకొనేందుకు ఈ పరీక్షలు చేస్తారు. ‘క్రియాటినిన్’ లెవెల్స్ పెరిగినట్లయితే కిడ్నీలు దెబ్బ తిన్నట్లు వైద్యులు గుర్తిస్తారు. ‘క్రియాటినిన్’ అనేది శరీరంలో పేరుకుపోయే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన, మలం ద్వారా బయటకు వెళతాయి. అలా కాకుండా రక్తంలో నిలువ ఉంటే.. వాటిని ‘క్రియాటినిన్’గా భావిస్తారు. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకునే వారిలో ఈ ‘క్రియాటినిన్’ నిలువ పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మాంసాహార ఆధారిత ప్రోటీన్స్ తీసుకునే వారి రక్తంలో ‘క్రియాటినిన్’ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని, కిడ్నీ పేషెంట్లు అలాంటి ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఒకవేళ మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరం. అప్పుడే మీ శరీరంలో కిడ్నీలు భద్రంగా ఉంటాయి. కిడ్నీలు దెబ్బతిన్నట్లయితే ‘క్రియాటినిన్’ విలువలు పెరిగిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. అయితే మన శరీరంలో ‘క్రియాటినిన్’ నిలువలను తగ్గించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లతో ‘క్రియాటినిన్’ విలువలను తగ్గించుకోవచ్చు. అందుకు ఈ డైట్ టిప్స్ పాటించండి.
ప్రోటీన్ ఆహారం తగ్గించాలి:
మన శరీరానికి అత్యంత అవసరమైన ప్రోటీన్స్ ఫుడ్ కిడ్నీలకు భారం అవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. ఒకవేళ మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తగ్గిస్తే మంచిదని చెబుతున్నారు. మీరు ప్రోటీన్ తీసుకోవడం అవసరం అనుకుంటే చేపలు, కోడిగుడ్డు వైట్, వృక్ష ఆధారిత ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వృక్ష సంబంధిత ప్రోటీన్ ఆహారాల్లో పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అలాగే పాల ఉత్పత్తులు కూడా మంచివే. అయితే మీ శరీర బరువును బట్టి ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటే ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
‘క్రియాటినిన్’ సప్లిమెంట్స్ వాడొద్దు:
మన శరీరంలో ‘క్రియాటినిన్’ అనేది కాలేయం ఉత్పత్తి చేస్తుంది. క్రియాటినిన్ మన కండరాలలో శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. కండరాలు పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. సాధారణంగా అథ్లెట్స్, జిమ్ముకు వెళ్లే అలవాటు ఉన్నవారు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. వీటి వల్ల శరీరంలో అనవసరంగా ‘క్రియాటినిన్’ నిల్వలు పెరిగే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలు సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ సప్లిమెంట్లకు దూరంగా ఉండాలి.
నీళ్లు ఎక్కువగా తాగండి:
నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరంలో ‘క్రియాటినిన్’ నిలువలను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. నీళ్లు తీసుకోవడం ద్వారా కిడ్నీలు కూడా సక్రమంగా పనిచేస్తాయని.. అప్పుడే మన శరీరం నుంచి మలినాలు వ్యర్థాలు బయటకు వెళ్లి కిడ్నీలు సక్రియం అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉప్పు తగ్గించాలి:
ఉప్పు అతిగా తినడం వల్ల రక్తపోటు భారీగా పెరుగుతుందని తద్వారా గుండెకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా నెఫ్రాలజీ జర్నల్ ప్రకారం ఎవరైతే ఉప్పు వినియోగం అధికంగా ఉంటుందో వారి కిడ్నీలు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే ఉప్పు అధికంగా ఉండే బేకరీ ఉత్పత్తులు, పచ్చళ్ళు, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా నిమ్మకాయ, టమాటో, పుదీనా వంటి ఉత్పత్తులను వాడటం ద్వారా ఉప్పు వినియోగాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు
ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తినాలి:
మన ఆహారంలో పీచు పదార్థం ఉండటం ద్వారా రక్తంలో ‘క్రియాటినిన్’ నిలువలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో డైటరీ ఫైబర్ ఉండటం ద్వారా మన కిడ్నీలు పాడవకుండా చక్కగా పనిచేస్తాయని తద్వారా ‘క్రియాటినిన్’ నిలువలు రక్తంలో పెరగవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘క్రియాటినిన్’ నిలువలు పెరగకుండా ఉండాలంటే కూరగాయలు పండ్లు, ఆకుకూరలు తినాలని సూచిస్తున్నారు.
Also Read : కడుపు ఉబ్బరంతో పాటు బరువును తగ్గించగలిగే టీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply