West Nile Fever: బాబోయ్ కొత్తరకం జ్వరం, పాలిచ్చే తల్లులు జాగ్రత్త - ప్రభుత్వం అప్రమత్తం
West Nile Fever Cases: కేరళలో వెస్ట్ నైల్ ఫివర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ జారీ చేసింది.
West Nile Fever Cases in Kerala: కేరళలో మరో కొత్త వ్యాధి కలవర పెడుతోంది. త్రిసూర్, మలప్పురం, కొజికోడ్ జిల్లాల్లో West Nile Fever కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అలెర్ట్ జారీ చేసింది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లోని అధికారులు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. దోమల సంతతిని తగ్గించాలని ఆదేశించింది. వర్షాకాలం రాకముందే అన్ని చోట్లా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. సీనియర్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం...West Nile Fever దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వెస్ట్ నైల్ వైరస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి ఈ వెస్ట్ నైల్ ఫివర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌కి పక్షులే ప్రైమరీ క్యారియర్స్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే...ఈ వ్యాధి సోకిన వాళ్లలో దాదాపు 80% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అవయవ మార్పిడి, రక్త మార్పిడి ద్వారానే కాకుండా...పాలిచ్చే తల్లుల నుంచి పిల్లలకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
వెస్ట్ నైల్ ఫివర్ లక్షణాలివే..
West Nile Virus సోకిన వాళ్లలో చాలా మందిలో లక్షణాలు (West Nile Fever Symptoms) కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే...20% మందిలో మాత్రం సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి సోకిన వాళ్లలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, శరీరంపై దద్దులు లాంటి లక్షణాలు ఉంటున్నాయి. అయితే...ఈ వైరస్ సోకిన వాళ్లలో 1% బాధితుల్లో న్యూరో సమస్యలు తలెత్తుతున్నాయి. encephalitis వచ్చే ప్రమాదముంది. మెదడులో తీవ్రమైన మంటలు రావడంతో పాటు అది క్రమంగా వెన్ను వరకూ వ్యాప్తి చెందుతుంది. కాకపోతే...ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు.
ట్రీట్‌మెంట్ ఉందా..?
వెస్ట్ నైల్ ఫివర్‌కి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ అంటూ ఏమీ లేదు. అయితే...జ్వరం, ఒళ్లు నొప్పులకు వినియోగించే మందులతో కొంత వరకూ ఈ వ్యాధిని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వాళ్లకి మాత్రం ఈ మెడికేషన్ సరిపోదని స్పష్టం చేస్తున్నారు. అలాంటి బాధితులను హాస్పిటల్‌లో చేర్చి IV ఫ్లుయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మందిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. బాధితుల వయసు ఆధారంగా ఈ వ్యాధి నుంచి రికవరీ అవడం ఆధారపడి ఉంటుందని కొంత మంది వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వాళ్లు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లలో మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకు మాత్రం ఎక్కువ రోజుల పాటు చికిత్స అందించాల్సి వస్తుంది. ప్రస్తుతం కేరళలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసింది.
Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిపై నిఘా, ఆఫీస్‌కి రాని ఉద్యోగులకు రెడ్‌ఫ్లాగ్ - డెల్ కంపెనీ కొత్త రూల్స్