SmartPhone: రోజూ మీ స్మార్ట్ ఫోన్‌ను 4 గంటలు కంటే ఎక్కువ సేపు చూస్తున్నారా? ఈ ప్రమాదం తప్పదు!
Smart Phone Side Effects: మీరు మీ స్మార్ట్ ఫోన్‌ను రోజూ ఎన్ని గంటలు చూస్తుంటారు? ఒక వేళ మీ జవాబు 4 గంటలకు పైనే అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే.
SmartPhone: ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలు కూడా ఫోన్ లేకుండా నిమిషం ఉండలేకపోతున్నారు. ఏడుస్తుంటే ఫోన్.. తింటుంటే ఫోన్.. ఇలా ఫోనే లోకంగా మారింది. స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. టెక్నాలజీ పెరగడం మంచిదే కావచ్చు. కానీ అది మనిషిని నాశనం చేసే వరకు పెరగడం ప్రమాదకరం. టెక్నాలజీని ఎంత తక్కువగా వాడితే మనం అంత ఆరోగ్యంగా ఉంటామనేది నిజం. స్మార్ట్ ఫోన్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
అయితే కౌమారదశలో ఉన్నవారు (10-19 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు) రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్ ను ఉపయోగిస్తారు. అలాంటివారిలో ప్రతికూల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల ఆలోచనలు, మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొంది.
కొరియాలో ఉన్న హన్యాంగ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన బృందం 50,000 కంటే ఎక్కువ మంది కౌమారదశలో పాల్గొనేవారి డేటాను విశ్లేషించి, కౌమారదశలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం, వారి ఆరోగ్యం (శారీరక, మానసిక) మధ్య ఉన్న సంబంధాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసింది.
పరిశోధన జరగడానికి ముందే, పెరుగుతున్న పిల్లలలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఇటీవలి సంవత్సరాలలో బాగా పెరిగిందని తేలింది. ఈ వినియోగం వల్ల నిద్ర సమస్యలు, మానసిక రుగ్మతలు, మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్ వంటి ప్రతికూల ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది.
నిద్ర సమస్యలు:
స్క్రీన్ సమయం కారణంగా ఒక వ్యక్తికి నిద్ర కరువు అవుతుంది. స్మార్ట్ ఫోన్ అతిగా వాడితే నిద్ర చక్రం దెబ్బతింటుంది. రాత్రి పడుకునేముందు స్మార్ట్ ఫోన్ చూస్తుంటే నిద్రరాదు. అందులో నుంచి వచ్చే బ్లూలైట్ మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించడంతో.. నిద్ర హార్మోన్ తక్కువైతే నిద్రరాదు. బ్లూలైట్ ఎక్కువసేపు కంటిపై పడితే నిద్రలేమి సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారు.
మానసిక రుగ్మతలు:
స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారు మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారు. ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్ (MSD):
ఇది కండరాలు, స్నాయువులు, నరాలు, మృదులాస్థి, కీళ్ళు, వెన్నెముక డిస్క్‌ల రుగ్మత. వాటిని ఒకే స్థితిలో ఉంచినప్పుడు ఇది సక్రియం అవుతుంది. ఫోన్ అదేపనిగా చూస్తుంటే కళ్లు అలసిపోతాయి. కళ్లు పొడిబారడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, నిరసంలాంటి సమస్యలు వస్తాయి. ఫోన్ వాడకం ఎక్కువైతే దృష్టి సమస్యలు కూడా అధికమవుతాయి. రోజంతా ఫోన్ వాడితే.. మెడ, వెన్నెముక ఎక్కువసేపు వంగుతుంది. దీంతో దీర్ఘకాలిక వెన్నెముక సమస్యలు వస్తాయని అధ్యయనం పేర్కొంది.
Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.