బ్రిటన్లో పిల్లలను చంపేస్తున్న కొత్త వ్యాధి - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
కొత్త బ్యాక్టిరియాలు, వైరస్‌లు పుట్టుకొచ్చి కొత్త సమస్యలను తీసుకొస్తున్నాయి.
కరోనాతో మొదలైన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా దాన్నుంచే పూర్తిగా తేరుకోని ప్రపంచానికి ఎక్కడో ఒక మూల కొత్త బ్యాక్టిరియాలు, వైరస్‌లు పుట్టుకొచ్చి సరికొత్త రోగాలను మోసుకొస్తున్నాయి. అలా బ్రిటన్లో పుట్టుకొచ్చింది ‘స్ట్రెప్ ఎ’ అనే వ్యాధి. ఇది పిల్లలపై తమ ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికాలో కూడా దీని కేసులు బయటపడుతున్నాయి. ఆ రెండు దేశాల్లో కలిపి ఈ వ్యాధి కారణంగా తొమ్మిది మంది పిల్లలు మరణించారు. వారిలో అధికంగా పదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. దీంతో ఆయా దేశాల ఆరోగ్య శాఖలు పిల్లలను జాగ్రత్తగా చూపుకోవాలని హెచ్చరించారు.
స్ట్రెప్ ఎ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
‘స్ట్రెప్ ఎ’ అనేది ఒక బ్యాక్టిరియా. ఇది గొంతు, చర్మంపై దాడి చేస్తుంది. దీని వల్ల తేలికపాటి జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా ప్రాథమికంగా చూపించదు. తరువాత తీవ్రమైన జ్వరంగా, గొంతు ఇన్ఫెక్షన్ గా మారిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బ్యాక్టిరియాలు ఎదుటివారిపై పడి వారికి కూడా ఇది వ్యాపిస్తుంది. అందుకే దీన్ని అంటువ్యాధిగా నిర్ధారించారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ సోకిన తరువాత లక్షణాలు కింది విధంగా ఉంటాయి.జ్వరం, చర్మంపై దద్దుర్లు, టాన్సిల్స్, మింగేటప్పుడు గొంతు నొప్పి, గొంతు దగ్గరి గ్రంథుల వాపు వంటివి వస్తాయి. అలాగే జలుబు చేయడం, విపరీతమైన చెమట పట్టడం, అలసట, చిరాకు, డీహైడ్రేషన్, ఆకలి వేయకపోవడం వంటివి కలుగుతాయి. ముఖ్యంగా పిల్లలు టాన్సిల్స్ నొప్పి అంటున్నా, అవి వాచినా కూడా తేలికగా తీసుకోవద్దు.
వచ్చాక ఏం చేయాలి?
ఈ వ్యాధికి ఎలాంటి టీకాలు లేవు. అయితే వాటిపై సమర్థవంతంగా పనిచేయగల అనేక రకాల యాంటీ బయోటిక్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే మాస్కులు పెట్టాలి. వైద్యులను సంప్రదించాలి.
Also read: బంగారంలా మెరిసిపోతున్న బియ్యం, ఏంటీ గోల్డెన్ రైస్? తినడం వల్ల ఉపయోగాలేంటి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.