Stomach Pain: కడుపు నొప్పి తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే
చాలా మందికి కడుపు నొప్పి వచ్చి తగ్గిపోతుంది. కొన్ని సార్లు ఎక్కువ సేపు ఉండి ఇబ్బంది పెట్టేస్తుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు మీ డైట్ లో చేర్చుకోండి.
అందరికీ ఎప్పుడో ఒకప్పుడు కడుపు గడబిడ చేసేస్తుంది. వికారం, అజీర్ణం, వాంతులు, ఉబ్బరం, అతిసారం లేదా మలబద్ధకం వంటి కొన్ని పొట్ట సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టేస్తాయి. అందుకు కారణం మనం తీసుకునే ఆహారం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతినడమే. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అధిక ఫైబర్, కొవ్వులు ఉండే వాటిని నివారించాలి. శరీరం సులభంగా విచ్చిన్నం చేసుకోగలిగే సాధారణ కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్ తీసుకోవడం మంచిది. మీరు ఎప్పుడూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఈ ఆహారాలు మీ సమస్యని తగ్గించేస్తాయి. వీటిని తీసుకుంటే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
కడుపు నొప్పి తగ్గించే పదార్థాలు
అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగిన అల్లం సహజ నివారిణి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అల్లం అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి, అజీర్తి, కడుపులో మంట, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి అనేక రోగాలకు ఇది దివ్యౌషధంగా పని చేస్తుంది. టీ లేదా ప్రతిరోజూ చిన్న అల్లం ముక్క తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
లైకోరైస్: పొట్ట ఉబ్బరం, నొప్పి, వాపుని తగ్గించడానికి ఇది చక్కగా పని చేస్తుంది. పొట్టలో ఉండే ఆరోగ్యకరమైన శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది.
అవిసె గింజలు: డైటరీ ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకి సహాయపడుతుంది. ఈ గింజల్లోని నూనె పేగులకు మంచి చేస్తుంది. రోజూ గుప్పెడు అవిసె గింజలు తింటే చాలా మంచిది. ఇందులోని ఫైబర్ పెద్ద పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అరటిపండు: ప్రీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పెక్టిన్ కంటెంట్ పేగుల్లోని అదనపు దర్వాన్ని గ్రహిస్తుంది. మాల విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. ప్రొ బయోటిక్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. గ్యాస్, ఉబ్బరం లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బియ్యం, వోట్మీల్, టోస్ట్ వంటి కార్బోహైడ్రేట్లు కడుపు నొప్పి తగ్గించేందుకు సహాయపడతాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల సమస్యలతో బాధపడే వారికి వైట్ రైస్ గొప్ప ఎంపిక. జీర్ణం చేయడం సులభం. ఇందులో కార్బో హైడ్రేట్లు ఉంటాయి. శరీరానికి శక్తిని అందిస్తుంది.
కొన్ని ఆహారపు అలవాట్లు గట్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. మద్యపానం, పొగాకు నమలడం ఆరోగ్యానికి అన్ని విధాలుగా హాని చేస్తుంది.. ఇవే కాదు ఒత్తిడి, నిద్రలేమి, అతిగా వ్యాయామం చేయడం గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆహారంతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు తినాలి. ఇవే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: సమ్మర్‌లో అల్లం, వెల్లుల్లి తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి