Scandinavian Sleep Method : నిద్ర కోసం పోరాటమా? దంపతుల మధ్య 'దుప్పటి' గొడవలకు చెక్ పెట్టే 'స్కాండినేవియన్ స్లీప్ మెథడ్'
రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర కోసం తపస్సు చేసే వాళ్లు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి స్కాండినేవియన్ స్లీప్ మెథడ్ ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామితో దుప్పటి పంచుకొని ఇబ్బంది పడే వాళ్లు ఇది మంచి టెక్నిక్

Scandinavian Sleep Method : ప్రతిరోజూ రాత్రి బెడ్ మీద పడుకున్న దంపతుల మధ్య జరిగే ఒక నిశ్శబ్ద యుద్ధం గురించి మీకు తెలుసా? అదే దుప్పటి కోసం జరిగే వార్. చాలా మంది ఒకే పెద్ద దుప్పటిని కప్పుకుంటారు. అయితే పడుకునే సమయానికి అంతా బాగానే ఉంటుంది. కానీ డీప్ స్లీప్‌లోకి వెళ్లిన తర్వాత అసలైన వార్ మొదలవుతుంది. ఒకరు తమ వైపునకు దుప్పటి లాగుతుంటే మరొకరు తమ వైపునకు లాగుతుంటారు. దీంతో ఒకరు చలిలో నిద్రపట్టక అవస్థలు పడుతుంటే మరొకరు వెచ్చగా మంచి నిద్రలోకి జారుకుంటారు. ఇది చాలా కుటుంబాల్లో నిత్యం జరుగుతున్నదే.
ఇది చూడటానికి చిన్నగానే అనిపించినా దీని వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి పరిశోధనల్లో తేలింది. ఆరోగ్య సమస్యలే కాకుండా బంధాలపై కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. అందుకే దీనికి పరిష్కారంగా స్కాండినేవియన్ స్లీప్ మెథడ్ మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిద్రను మెరుగుపరచడమే కాకుండా సంబంధాలను కూడా కాపాడుతుందని అంటున్నారు.
స్కాండినేవియన్ స్లీప్ మెథడ్ అంటే ఏంటీ?
స్కాండినేవియన్ స్లీప్ మెథడ్ అనగానే ఏదో కొత్త పదంలా అనిపించినా ఇది చాలా సరళమైనది. ఒకే మంచంపై పడుకున్న ఫ్యామిలీ ఒకే పెద్ద దుప్పటిని కప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ మెథడ్ ప్రకారం మంచంపై ఎంతమంది పడుకుంటే వేర్వేరు దుప్పట్లు కప్పుకోవాలి. స్కాండినేవియన్ దేశాలైన స్వీడన్, నార్వే, డెన్మార్క్ వంటి ప్రాంతాల్లో ఈ పద్ధతి పాటిస్తున్నారు. మన భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పద్ధతినే పాటిస్తారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని దుప్పట్లు కప్పుకుంటారు. దీని వల్ల ప్రశాంతమైన నిద్రపడుతుంది. సాన్నిహిత్యాన్ని కోల్పోకుండా ఉంటారు. వ్యక్తిగత సౌకర్యాన్ని కూడా కాపాడుకుంటారు.
అందరి శరీరాలు ఒకటి కాదు
దుప్పి కప్పుకున్న తర్వాత శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మార్పులు జరుగుతుంటాయి. ఉష్ణోగ్రత తగ్గే తీరు ప్రతి వ్యక్తిలోనూ వేర్వేరుగా ఉంటుంది. దీన్ని హాట్ స్లీపర్స్,కోల్డ్ స్లీపర్స్ అని పిలుస్తారు. శరీర నిర్మాణం, హార్మోన్‌ల ప్రభావం వల్ల నిద్రలో మనకు అవసరమయ్యే ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. పురుషుల కంటే మహిళల చేతులు, కాళ్ల త్వరగా చల్లబడతాయి. ఎందుకంటే వారి శరీరం అంతర్గత అవయవాలను వెచ్చగా ఉంచడానికి ప్రాధాన్య ఇస్తుంది. అందుకే మహిళలు దుప్పటిని పూర్తిగా కప్పుకోవడానికి ఇష్టపడతారు. పురుషులు మాత్రం కాళ్లను బయటకు పెట్టడానికి మొగ్గు చూపుతారు.
ఇన్ని వ్యత్యాసాలు ఉన్నందున ఒకే దుప్పటిని పంచుకొని కప్పుకుంటే ఒకరు ఇబ్బంది పడుతుంటారు. మరొకరు చలిలో వణుకుతుంటారు. ఇలాంటి టైంలోనే స్కాండినేవియన్ విధానం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తి తమ శరీర తత్వానికి తగ్గట్టుగానే తేలికపాటి లేదా మందపాటి దుప్పటిని ఎంచుకునే వీలుంటుంది. దుప్పటి పంచుకునే వాళ్లు పదే పదే లేస్తుంటే వేరే వ్యక్తికి ఇబ్బంది తప్పదు. దీని వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. పురుషుల కదలికల వల్ల మహిళలకు నిద్ర భంగం ఎక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.




















