PM Modi Chairs Covid Meeting: కొవిడ్ ఉద్ధృతిపై ప్రధాని మోదీ సమీక్ష.. వారికి ఇక వర్క్ ఫ్రం హోం
దేశంలో కరోనా కేసులు పెరుగుతోన్న వేళ ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదల, వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో ఆరోగ్యశాఖ, కొవిడ్ వర్కింగ్ గ్రూప్ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కీలక నిర్ణయం..
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించారు. కంటైన్‌మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.
కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న కారణంగా గర్భిణులు, దివ్యాంగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు ఇచ్చారు.
భారీగా కేసులు..
దేశంలో కొత్తగా 552 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఈ మొత్తం కేసుల్లో 1,409 మంది ఒమిక్రాన్ బాధితులు రికవరయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, దిల్లీ (513), కర్ణాటక (441), రాజస్థాన్ (373), కేరళ (333), గుజరాత్ (204) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 224 రోజుల్లో ఇదే అత్యధికంగా. యాక్టివ్ కేసుల సంఖ్య 5,90,611కు చేరింది. గత 197 రోజుల్లో ఇదే అత్యధికం. గత ఏడాది మే 29న దేశంలో 1,65,553 కరోనా కేసులు నమోదయ్యాయి.
కొత్తగా 327 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4,83,790కి పెరిగింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.66 శాతానికి పెరిగింది. కరోనా రికవరీ రేటు 96.98 శాతానికి చేరింది.
Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి