పొడవుగా ఉన్న వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ
బరువులాగే, ఎత్తు కూడా కొన్ని రకాల జబ్బులు వచ్చే అవాకాశాన్ని పెంచుతుంది.
అధిక బరువు ఉన్న వారికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, కీళ్లు అరిగిపోవడం, గుండె సమస్యలు వారికి వస్తాయి. బరువు ఎక్కువగా ఉన్నవారిలో వచ్చినట్టే, పొడవు ఎక్కువగా ఉన్న వారిలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. బరువు ఎక్కువగా ఉంటే వ్యాయామం చేసి, తగ్గి సాధారణ బరువుకు రాగలరు. కానీ పొడవు ఎక్కువగా పెరిగిన వారికి ఆ అవకాశం కూడా లేదు. మనిషి ఎత్తును బట్టి వచ్చే రోగాలను కనుక్కునేందుకు ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
అమెరికాలోని రాకీ మౌంటెయిన్ రీజినల్ వీఏ మెడికల్ సెంటర్ పరిశోధకులు శరీర ఎత్తుతో ముడిపడిన సమస్యలు కనుక్కునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. వారు జన్యు విశ్లేషణపై దృష్టి పెట్టారు. శరీర ఎత్తు వారి ఆరోగ్యాన్ని ఎలా నిర్ణయిస్తుందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అధ్యయనంలో పొడవు ఎక్కువగా ఉన్నవారిలో గుండెలయ తప్పటం, కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు అధికంగా వస్తున్నట్టు తేలింది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు మాత్రం వీరికి తక్కువ. ఈ విషయంలో వీరు లక్కీ ఫెలోస్ అనే చెప్పాలి.
ఈ సమస్యలు ఎక్కువ...
ఇక వీరికి అధికంగా వచ్చే సమస్యలు నాడీ సమస్యలు. కాళ్లు, చేతుల్లో నాడులు దెబ్బతినే అవకాశం ఎక్కువని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే కాళ్లు, పాదాల మీద పుండ్లు పడడం, చర్మ,ఎముకల ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉన్నట్టు తెలిపారు. ఎత్తుగా ఉండే వారి జన్యువుల్లోనే ఈ సమస్యల తాలూకు మూలాలు ఉండొచ్చని వారి అంచనా వేస్తున్నారు అధ్యయనకర్తలు. గతంలో చేసిన అధ్యయనాల్లో ఎత్తుగా ఎక్కువగా ఉన్నవారికి వందకు పైగా రోగాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. అయిదు అడుగుల తొమ్మిది అంగుళాలు దాటిన వారందరిని ఎత్తయిన వారిగా గుర్తిస్తారు. అందుకే అధ్యయనంలో భాగంగా అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్నవారికే తీసుకున్నారు పరిశోధకులు.
ముఖ్యంగా స్త్రీలో అయిదు అడుగుల మూడు అంగుళాల కన్నా ఎత్తు ఎక్కువగా ఉండే వారంతా పొడవైన మహిళల కిందకే వస్తారు. వారిలో ఆస్తమా రోగం త్వరగా వస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.
Also read: కొబ్బరి నూనె స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే ఇలా పరీక్షించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.