What Is Most Common Reason For Knee Pain:నొప్పులు అనారోగ్యానికి వార్నింగ్ బెల్ కావొచ్చు- అప్రమత్తం కాకుంటే ముప్పేనంటున్న వైద్యులు
నలభై ఏళ్లు దాటిన తర్వాత మోకాళ్లు, భుజాలు, నడుము నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఇది సహజమని చాలా మంది అనుకుంటారు. కానీ వైద్యులు మాత్రం అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు.

What Is Most Common Reason For Knee Pain: వయసు పెరుగుతున్న కొద్ది బాడీలో చాలా మార్పులు వస్తాయి. వాటిని చాలా మంది లైట్ తీసుకుంటారు. మరికొందరు అనవసరమైన భయాందోళనలకు గురి అవుతుంటారు. ఈ రెండూ ప్రమాదమేనని వైద్యులు చెబుతున్నారు. ఏ చిన్న అనుమానం ఉన్నా సరే కంగారు పడకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.
అలా వయసు పెరిగిన కొద్దీ వచ్చే సమస్యల్లో మోకాళ్ల నొప్పులు, భుజాలు పట్టేయడం, నడుం నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. మారుతున్న వర్క్ కల్చర్, జీవనశైలి కారణంగా నలభై ఏళ్లకే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందులో కొందరు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటారు. చాలా మంది ఏం కాదులే అని ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసి ఆ క్షణానికి నొప్పిని తగ్గించుకుంటారు. ఇలాంటి వాటితోనే అసలైన ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నలభై ఏళ్ల తర్వాత మోకాళ్ల నొప్పులు, భుజాలు పట్టేయడం ఇవన్నీ మామూలేలే అయినా సాధారణం కాదు అంటున్నారు వైద్యులు. దీన్ని అలానే వదిలేయకూడదని చెబుతున్నారు. ఇదే విషయంపై మణిపాల్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ జీవీ రెడ్డిని అడిగితే కీలక విషయాలు చెప్పుకొచ్చారు."వయస్సు పెరిగేకొద్దీ మన శరీరంలో కొన్ని మార్పులు జరగడం సహజం. మణికట్టు భాగాల్లో ఉండే కార్టిలేజ్ మందగించిపోతుంది, కండరాలు కొంత బలహీనమవుతాయి. కానీ ఈ మార్పుల వల్ల నొప్పి తప్పనిసరిగా వస్తుందని కాదు. నిజానికి, చాలా సందర్భాల్లో, నొప్పి ఏదో ఒక సమస్యకు సంకేతం. అది వాపు కావచ్చు, కూర్చునే విధానం తప్పు కావొచ్చు, ఎక్కువగా కదలకుండా కూర్చోవడం వల్ల కావొచ్చు, గతంలో తగిలిన గాయం కావచ్చు లేదా ఆర్థరైటిస్ / ఆటో ఇమ్యూన్ వంటి వ్యాధుల ప్రారంభ సూచన కావచ్చు."అని వివరించారు.
డాక్టర్ జీవీ రెడ్డి ఇంకా ఏమన్నారంటే"నలభై ఏళ్లు దాటినవారిలో కీళ్ల నొప్పులకి ప్రధాన కారణం, కదలకుండా కూర్చోవడం లాంటి జీవనవిధానం(Sedentary Lifestyle) ఎక్కువసేపు కూర్చోవడం, శారీరకంగా చురుగ్గా లేకపోవడం, సరైన వ్యాయామం చేయకపోవడం వంటివి కీళ్లు, కండరాలు బిగుసుకుపోవడానికి దారి తీస్తాయి. అలాగే ఎక్కువగా శ్రమించే వ్యాయామాల వల్ల కూడా మణికట్టుని, కీళ్లని ఒత్తిడికి గురి చేస్తాయి."
నొప్పి వచ్చిందని తెలిసిన వెంటనే చాలా మంది మెడికల్ షాప్ వద్దకు వెళ్లి ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వెసుకుంటారు. ఇది ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నొప్పికి అసలు కారణం తెలుసుకోకుండా మందులు వేసుకుంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయని వార్న్ చేస్తున్నారు. " నొప్పి ఎందుకొస్తోందో, మూలం తెలుసుకోకుండా, పట్టించుకోకుండా, నొప్పిని తగ్గించే మాత్రలతో కప్పిపుచ్చడం వల్ల, పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీర్ఘకాలిక నొప్పి వల్ల యాక్టివిటీ తగ్గిపోతుంది, స్వతంత్రంగా జీవించలేము, తరచూ కింద పడిపోవడం, గాయాలు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. ముఖ్యంగా, ఇది ఇంకా పెరగకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం." అని జీవీ రెడ్డి చెప్పుకొచ్చారు.
నొప్పిన వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే అసలు కారణం గుర్తిస్తారు. అలా అసలు కారణం తెలిస్తే ఎలాంటి మందులు అవసరం లేకుండా నొప్పులను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. "ఈ నొప్పిని నియంత్రించడానికీ, నివారించడానికీ మార్గాలున్నాయి. రోజువారీ నడక, ఈత, తక్కువ ఒత్తిడితో కూడిన వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు,కీళ్లు చురుకుగా ఉంటాయి. ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవడం, శరీర బరువును నియంత్రణలో పెట్టుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, సరైన పద్ధతిలో కూర్చోవడం లాంటి జీవనశైలిలోని మార్పులతో, ఈ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ, మంచి చెప్పులు వేసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా కీలకమే." అంటున్నారు జీవీ రెడ్డి.
మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు శరీరం తెలియజేస్తూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వాటిని వార్నింగ్ బెల్స్ మాదిరిగా భావించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ""స్థూలంగా చెప్పాలంటే, నలభై ఏళ్ల తరువాత నొప్పులు సహజమైనవే అయినా, సాధారణమైనవిగా తీసుకోవడం సరైనది కాదు. మన శరీరం చెప్పేది వినిపించుకోవడం, అవసరమైన వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా మనం చాలా కాలం ఆరోగ్యంగా, చురుగ్గా జీవించవచ్చు. నొప్పితో బతకాలని అనుకోకండి. మీ కాళ్ల మీద మీరు నిలబడాలంటే, మీ కీళ్లు, మణికట్టు మీద కాస్త శ్రధ్ధ పెట్టండి." అని జీవీ రెడ్డి సూచిస్తున్నారు.





















