Corona Virus: కొలెస్ట్రాల్ మందులతో కోవిడ్‌కు చెక్.. తాజా అధ్యయనంలో వెల్లడి
రక్తంలో అసాధారణ రీతిలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కరిగించేందుకు ఉపయోగించే ఔషధాలు కోవిడ్ 19 వ్యాధిని 70 శాతం మేర తగ్గిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగించే మందులతో కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ తగ్గించవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రక్తంలో అసాధారణ రీతిలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కరిగించేందుకు ఉపయోగించే ఔషధాలు కోవిడ్ వ్యాధిని 70 శాతం మేర తగ్గిస్తున్నట్లు తేలింది. బ్రిటన్‌కు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది.
రక్తంలో కొవ్వును కరిగించేందుకు ఉపయోగించే ఫెనోఫైబ్రేట్ మరియు దాని క్రియాశీల రూపమైన ఫెనోఫిబ్రిక్ యాసిడ్లు మనుషుల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. రోజువారీగా తీసుకునే ఫెనోఫైబ్రేట్ ఔషధాలతో కోవిడ్ సంక్రమణ తగ్గినట్లు వారు గుర్తించారు.
చాలా చవకైన ఔషధం..
ఫెనోఫైబ్రేట్ అనేది చాలా చవకైన ఔషధం అని.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా లబిస్తుందని ఇటలీలోని శాన్ రాఫెల్ సైంటిఫిక్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన రచయిత ఎలిసా విసెంజీ వెల్లడించారు. నోటి ద్వారా తీసుకునే ఈ మందుకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిని ఉపయోగించడం సురక్షితమేనని చెప్పారు. ఈ మందు వల్ల మధ్యస్థ, దిగువ ఆదాయ దేశాల్లో గణనీయ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఎఫ్‌డీఏ, ఎన్‌ఐసీఈ ఆమోదం..
రక్తంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు ఫెనోఫైబ్రేట్‌ను ఉపయోగించవచ్చని అమెరికాకు చెందిన యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), యూకేకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (ఎన్‌ఐసీఈ) సహా పలు దేశాల ఔషధ నియంత్రణా సంస్థలు సైతం ఆమోదం తెలిపాయని ఎలిసా పేర్కొన్నారు.
క్లినికల్ ట్రయల్స్..
ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగులకు ప్రస్తుతం రెండు దశలుగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ఇజ్రాయెల్‌లోని హీబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం సూచనలతోనే ఈ ఔషధాలను ఇస్తున్నామని పేర్కొన్నారు.
కోవిడ్ కొత్త వేరియంట్లు అయిన ఆల్ఫా, బీటా స్ట్రెయిన్‌లపై కూడా ఫెనోఫైబ్రేట్ సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. ఈ ఔషధం డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందా? లేదా? అనే విషయంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు వెల్లడించారు.
క్లినియల్ ట్రయల్స్ విజయవంతమైతే పిల్లలు, హైపర్ ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగనిరోధక శక్తి కోసం ఔషధాలను ఉపయోగించే వారు ఈ మందులను ఉపయోగించవచ్చని అన్నారు. టీకా తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు కూడా దీనిని ఎంచుకోవచ్చని తెలిపారు.
Also read: డయాబెటిస్ బాధితులు ఆపిల్ తినొచ్చా? ఎలాంటి ప్రభావం చూపుతుంది?