Poor Sleeping Habit: రాత్రి పూట నాకు నిద్రపట్టదు, నేనింతే అనే వారికి హెచ్చరిక- ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలంటున్న పరిశోధనలు
నాకు రాత్రి పూట బొత్తిగా నిద్రపట్టదు.. ఏదో అలా నిద్రపోతాను అంటూ చాలా మంది చెబుతుంటారు. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ మీకు తెలియకుండానే ప్రమాదం ముంచుకొస్తుంది.
నిద్రలేమితో మనిషి అలసిపోవడమే కాదు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కుంటాడని పరిశోధనలు చెబుతున్నాయి. మిన్నేసోటా(Minnesota)లోని రోచిస్టర్(Rochester)లో ఉన్న మయో క్లినిక్(Mayo Clinic) నిర్వహించి పరిశోధనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
రాత్రి వేళలో నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారు ప్రమాదంలో ఉన్నట్టే అంటోంది సర్వే. ప్రమాదకరమైన కొవ్వు వీళ్ల అవయవాలను మింగేస్తుందని హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమితో బాధపడే వారిలో ముందుగా పొట్టచుట్టూ విసెరల్ కొవ్వు పేరుకుపోతుంది. క్రమంగా అది ఇతర అవయవాలకు చేరి మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తుందట.
సెల్‌ఫోన్, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ గాడ్జెట్స్, పని ఒత్తిడి, లేట్‌నైట్ పార్టీలు ఇలా రకరకాల కారణాలతో నేటితరం నిద్రకు దూరమవుతోంది. ఇది ప్రమాదానికి సంకేతంగా పరిశోధన అభిప్రాయపడింది.
చాలా మంది సన్నంగా ఉన్న వారిలోనూ ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. చూడానికి సన్నంగానే ఉన్నా నిద్రలేమి కారణంగా వారిలో కొవ్వు పేరుకుపోయందని పరిశోధనలో తేలింది. ఎన్ని మంచి ఆహారపు అలవాట్లు ఉన్న వారు కూడా నిద్ర లేకుంటే సమస్యల్లో చిక్కుకుంటున్నట్టేనంటోంది లేటెస్ట్ స్టడీ.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్( Journal of the American College of Cardiology,)లో ప్రచురించిన ఈ స్టడీ కోసం 12 మందిపై స్టడీ చేశారు. 19 నుంచి 39 మధ్య వయసున్న వారిని 12 మందిని ఎంపిక చేసి ఈ పరిశోధన చేశారు.
వీళ్లను ముందుగా నాలుగు రోజుల పాటు వారి వారి అలవాట్లకు తగ్గట్టుగా అబ్జర్వేషన్‌లో ఉంచారు. నాలుగు రోజుల తర్వాత పరిశోధనకు అనుకూలంగా వారిని నిద్రపోమని చెప్పారు. 14 రోజుల పాటు పరిశోధన చేశారు వైద్యులు.
ఒక టీంను రాత్రి వేళలో నాలుగు గంటలే పడుకోమని చెప్పారు. మిగిలిన గ్రూప్‌నకు రాత్రి వేళలో తొమ్మిది గంటలు పడుకోమని చెప్పారు.
పరిశోధనకు వెళ్లక ముందు వారి ఎనర్జీ, కొవ్వు శాతం, శరీర భరువు, శరీరాకృతి అన్నింటినీ నోట్ చేశారు. 14 రోజుల పరిశోధన తర్వాత కూడా వాటిని మళ్లీ సరి చూశారు.
రోజు రాత్రి నాలుగు గంటలే పడుకున్న వారి శరీరాకృతి, కొవ్వు, బరువు తొమ్మిది గంటలు నిద్రిస్తున్న వారితో పోలిస్తే వచ్చిన తేడాను గమనించారు. వారి కంటే ఎక్కువ పెరిగినట్టు గుర్తించారు.
నాలుగు గంటల పాటు నిద్రించిన వారి పొట్ట భాగంలో విసెరల్ కొవ్వు అధికంగా ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. ఎప్పుడైనా కొవ్వు చర్మం కింద పేరుకుపోతుందని కానీ విసెరల్‌లో కొవ్వు పేరుకుపోతే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
అయితే ఇక్కడ ఇంకో ప్రమాదకరమైన విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఒకసారి ఈ కొవ్వు పేరుకుపోతే.. తర్వాత ఎంత ప్రయత్నించినా నార్మల్ కావడానికి చాలా సమయం పడుతుందట.
నిద్రపోయే సమయం పెంచినప్పటికీ సరైన ఆహారం తీసుకున్నా బరువు తగ్గుతారేమో కానీ విసెరల్‌లో కొవ్వు మాత్రం తగ్గదని హెచ్చరిస్తోంది పరిశోధన.
రాత్రి పూట కంటిన్యూగా కనీసం నాలుగు గంటలైనా నిద్రపోని వారు తర్వాత రికవరీ కోసం నిద్రపోయినా శారీరక అలసట తీరుతుందేమో కానీ కొవ్వుపై మాత్రం ప్రభావం చూపదని పెరుగుతూనే ఉంటుందంటున్నారు.
ఇలా కంటిన్యూ చేస్తూ పోతే ఇది ఊబకాయానికి, గండె, జీవక్రియకు సంబంధించిన వ్యాధులు మనిషిపై అటాక్ చేస్తాయట.
ఎక్కువ నిద్రపోని వారు కూడా నార్మల్ నిద్రపోయే వారితో సమానంగా రోజుకు 300 కేలరీలు ఆహారం తీసుకుంటారని ఇదే బరువు పెరగడానికి కారణమని పరిశోధన తేల్చింది.
విసెరల్ కొవ్వు దుష్ప్రయోజనాల్లో బరువు పెరగడం అనేది ఒక చిన్న పార్టే అంటున్నారు పరిశోధకులు. విసెరల్ కొవ్వు చేరిన సంగతి సీటీ స్కాన్ ద్వారా మాత్రమే గుర్తించగలరు.
ఇలా రోజులు గడిచే కొద్ది విసెరల్ కొవ్వు ఒక్కసారిగా అవయవాలపై అటాక్ చేస్తుందని.. అప్పటికి మేల్కొన్నా ప్రయోజనం ఏమీ ఉండదని చెబుతున్నారు.
విసెరల్ కొవ్వు టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఇలా మరిన్నింటితో ముడిపడి ఉంది. మీ అవయవాల చుట్టూ ఉన్న లైనింగ్ చాలా తీవ్రంగా మారితే గుండె, మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది.
తగినంత నిద్ర లేని వ్యక్తులకు రోజూ వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే కొవ్వు బారి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.