Chicken Pox: పిల్లల్లో పెరుగుతున్న చికెన్ పాక్స్ కేసులు -ఇది ఎందుకు వస్తుందంటే
చికెన్ పాక్స్ కేసులు మళ్లీ మనదేశంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలలో ఇవి కనిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలోని ఒక స్కూల్లో 20 మంది చిన్న పిల్లలు చికెన్ పాక్స్ బారిన పడ్డారు. అలాగే ఇద్దరు టీచర్లు కూడా ఆ వ్యాధికి గురయ్యారు. దీంతో ఆ జిల్లా అధికారులు స్కూళ్లలో చికెన్ పాక్స్ కేసులు త్వరగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించి, ఏమాత్రం లక్షణాలు కనిపించినా పిల్లల్ని స్కూలుకు పంపొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని చాలా చోట్ల చికెన్ పాక్స్ కేసులు బయటపడుతున్నాయి. దీన్నే మనం ‘అమ్మవారు’ అని కూడా అంటారు. ఒంటిపై చిన్న దద్దుర్లు వచ్చి దురద పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ దద్దుర్లు పెద్ద పెద్ద నీటి బుడగలుగా కూడా మారుతాయి.
ఎందుకు వస్తుంది?
చికెన్ పాక్స్ అనేది ‘వరిసెల్లా జోస్టర్’ అనే వైరస్ వల్ల కలిగే ఒక ఇన్ఫెక్షన్. ఎక్కువగా పిల్లల శరీరాలని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా జనవరి నుంచి జూన్ మధ్య ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వచ్చిన రెండు వారాలకుగాని వ్యాధి లక్షణాలు బయటపడవు. దీన్నే ఇన్ క్యుబేషన్ పీరియడ్ అని పిలుస్తారు. ఆ పీరియడ్ పూర్తయ్యాక లక్షణాలు బయటపడడం కనపడతాయి. ఈ ఇన్ఫెక్షన్ వస్తే 7 నుండి 21 రోజులు వరకు శరీరంలో ఉండే అవకాశం ఉంది. ఇది మనిషి నుండి మనిషికి త్వరగా సోకే అంటువ్యాధి.
లక్షణాలు
చికెన్ పాక్స్ లక్షణాలు సాధారణంగానే ఉంటాయి.
1. జ్వరం వస్తుంది.
2. తలనొప్పి కలుగుతుంది.
3. ఆకలి వేయదు.
4. శరీరంపై దురదలు వస్తాయి.
5. కొందరిలో చిన్న గడ్డల్లా మారి, ద్రవంతో నిండిన బొబ్బలుగా మారుతాయి.
ఆ దద్దుర్లు, బొబ్బలు ఎండిపోయేదాకా ఇది అంటువ్యాధిగానే ఉంటుంది. అంటే పక్కవారికి అంటే అవకాశం ఉంది. ఈ పూర్తిగా మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98 శాతం మందిలో ఈ వ్యాధి రాదు. ఈ వ్యాక్సిన్‌ను 12 నుంచి 15 నెలల వయసు ఉన్నప్పుడు పిల్లలకు ఇప్పించాలి. అలాగే మరో బూస్టర్ డోస్ నాలుగు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఇవ్వాలి. టీకాలు వేయని పిల్లలు పెద్దల్లో చికెన్ పాక్స్ తీవ్రంగా వస్తుంది. టీకాలు వేసిన వారిలో కూడా చికెన్ పాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అవి అంత తీవ్రంగా రావు. త్వరగా తగ్గిపోతాయి.
ఇది సోకాక చాలా విశ్రాంతి తీసుకోవాలి. చికెన్ పాక్స్ ఉన్నవారి బట్టలు, సబ్బులు, వస్తువులు మిగతావారు వాడకూడదు. ప్రతిరోజూ ఆటలమ్మ సోకిన వారు శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
Also read: గర్భం ధరించే ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ ఐదు ఆహారాలకు దూరంగా ఉండండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.