Diabetes: యువతలో మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!
వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది మధుమేహం. ఒక్కసారి వస్తే దాని ఫలితం జీవితకాలం.
ఒకప్పుడు మధుమేహం అంటే 40 లేదా 50 ఏళ్లు పైబడిన వారికే వచ్చేది. అది కూడా వంశపారపర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు చిన్న వయస్సులోనే ఎక్కువ మంది యువకులు మధుమేహం బారిన పడుతున్నారని బీఎంజె జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. అనేక అధ్యయనాలు ఆధారంగా చేసుకుని యువకులు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. 15 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారిలో మధుమేహం 56 శాతం పెరిగింది. అందుకు జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వాయు కాలుష్యంతో పాటు బాడీ మాస ఇండెక్స్ కారణాలు ఎక్కువగా ఉన్నాయి.
యువకుల్లో డయాబెటిస్‌కి కారణమేంటి?
దాదాపు రెండు దశాబ్ధాలుగా యువత చిన్న వయస్సులోనే డయాబెటిస్‌కు గురవ్వుతున్నవారి సంఖ్య క్రమేనా పెరగడాన్ని నిపుణులు గమనించారు. వారికి మధుమేహం రావడానికి గల ప్రధాన కారణాలను తెలుసుకున్నారు. అవి ఇవే..
☀ జెనెటిక్స్
☀ శారీరక శ్రమ లేకపోవడం
☀ మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం
☀ కాలుష్యం
☀ బాడీ మాస్ ఇండెక్స్
☀ ఇవే కాకుండా అధిక క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి కూడా పురుషులు, స్త్రీలని మధుమేహం బారిన పడేలా చేస్తుంది.
యువకుల్లో మధుమేహం వచ్చే ముందు లక్షణాలు
పెద్దవాళ్ళలో కనిపించినట్టుగా కాకుండా యువకుల్లో మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
☀ ఊహించని విధంగా బరువు తగ్గడం
☀ అతిగా మూత్ర విసర్జన
☀ ఎక్కువగా ఆకలి వేయడం
☀ జెంటిల్ ఇన్ఫెక్షన్స్
☀ బలహీనత
☀ అలసట
సాధారణంగా మధుమేహం వచ్చే ముందు కొన్ని లక్షణాలు చూపిస్తుంది. తరచుగా మూత్ర విసర్జన, దాహం, అస్పష్టమైన దృష్టి, పాదాల్లో తిమ్మిరి లేదా జలదరించినట్టుగా అనిపించడం, పొడి చర్మం కనిపిస్తుంది. మధుమేహం ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నరాలు దెబ్బతినడం, దృష్టి కోల్పోవడం, వినికిడి లోపం, దంతాల ఆరోగ్యం చెడిపోవడం వంటి ఇతర బాధలకు కారణమవుతుంది. మధుమేహం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
మందుల ద్వారా మాత్రమే కాదు సమతుల ఆహారం తీసుకుంటూ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటూ సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. కంటి నిండా నిద్ర చాలా అవసరం. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే దాని ఫలితం జీవితాంతం అనుభవించాలి. ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవాలి. మధుమేహం వచ్చిన తర్వాత దాన్ని అదుపులో ఉంచుకొకపోతే మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ కి దారి తీసే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కోవిడ్ తర్వాత గుండె జబ్బులతోనే అత్యధిక మరణాలు - అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి