Eating tips: టీవీ చూస్తూ తినే అలవాటు ఉందా? ప్రమాదంలో పడినట్లే!
ఇష్టమైన షో చూస్తూ, అంతకంటే ఇష్టమైన ఆహారం ఏదైనా తినడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ మీకు తెలుసా అది ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది.
ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చేస్తే తప్ప జీవిత వేగాన్ని అందుకోవడం కష్టం. సమయంతో పోటిపడి జీవిత వేగం పెరిగిపోయింది. అందుకే ఇష్టమైన షో లేదా వెబ్ సీరిస్ చూసేందుకు ప్రత్యేకంగా సమయం పెట్టడం ఇష్టం లేకో లేక భోజనాన్ని మరింత ఎంజాయ్ చెయ్యాలనో కానీ చాలా మంది టీవి చూస్తూ తినడం అలవాటు చేసుకున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపుతోందని అంటున్నారు నిపుణులు. ఈ అలవాటుతో ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుందాం.
ఎక్కువ తినేసే ప్రమాదం
తింటూ టీవి చూస్తూంటే మనసు తిండి మీద దృష్టి ఉండదు. అందువల్ల ఎంత తింటున్నారు? ఏం తింటున్నారు అనే విషయం గమనించలేరు. అందవల్ల ఎక్కువ తినేసే ప్రమాదం ఉంటుంది. మెదడు శరీరానికి ఎంత ఆహారం అవసరమవుతుందనే విషయాన్ని పెద్దగా గుర్తించదు. ఫలితంగా జీర్ణ సమస్యలు రావచ్చు, బరువు పెరిగి పోవచ్చు.
జంక్ ఎక్కువ తినే ప్రమాదం
టీవీ చూసే సమయంలో తినేందుకు చాలా సార్లు పోషకాహరం కంటే కూడా చిప్స్ వంటి జంక్ ఎంచుకుంటూ ఉంటారు. ప్యాక్ చేసిన ఆహారం తింటూ ఉంటారు. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. ఊబకాయం నుంచి గుండె జబ్బుల వరకు అన్ని రకాల అనారోగ్యాలకు కారణం కాగలదు.
టీవీ చూస్తూ భోంచెయ్యడం లేదా తినడం వల్ల పిల్లల్లో కూడా స్థూలకాయ సమస్యకు కారణం అవుతోందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. టీవీ చూస్తూ తినడం వల్ల జీవక్రియల రేటు మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంపిక చేసుకునే ఆహారం నాణ్యమైనది కాకపోవడం, తీసుకుంటున్న ఆహారం విషయంలో అవగాహన లేకపోవడం, సంతృప్తి కలిగే స్థాయిని గుర్తించకపోవడం వంటి పరిస్థితులు టీవీ చూస్తూ తినడం వల్ల కలుగుతాయి. ఇది బరువు పెరిగేందుకు ముఖ్యమైన కారణం అవుతుంది. ఎంత తిన్నప్పటికీ తింటున్న భావన కలుగుదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా టీవీ చూస్తున్నపుడు తీసుకునే ఆహారం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
⦿ తినడం ప్రారంభించే ముందు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది. అందువల్ల ఏం తింటున్నామనే దాని మీద నుంచి దృష్టి మళ్లదు.
⦿ ముందుగా ఆహారం రంగు, స్వరూపాన్ని పూర్తి స్థాయిలో కళ్లతో చూసి నమగ్నం చేసుకోవాలి. తర్వాత వాసన ఆస్వాదించాలి. ఇలా అన్ని ఇంద్రియాల అనుభవంతో తినడం ప్రారంభించాలి.
⦿ నోట్లోకి తీసుకున్న ప్రతి ముద్ద నమలుతూ, ఆస్వాధిస్తూ సమయం తీసుకుని నెమ్మదిగా తినాలి.
⦿ ఆకలిగా ఉన్నపుడు మాత్రమే తినాలి. కడుపు నిండిన వెంటనే తినడం ఆపెయ్యాలి.
⦿ టీవీ, ఫోన్, కంప్యూటర్ వంటి ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా తినడం మీద దృష్టి నిలిపి తినడం చాలా అవసరం.
⦿ తినే బోజనం తయారైన విధానాన్ని అభినందించండి. మీకు పోషణ అందించే భోజనం దొరికినందుకు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి.
⦿ మైండ్ ఫుల్ ఈటింగ్ టెక్నిక్ ను అనుసరించడం ద్వారా భోజనం మీద దృష్టి నిలపడం అలవాటు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక కిస్మిస్ తీసుకుని దాని రంగును గమనించి, దాని స్వరూపాన్ని అనుభవించి, నోట్లోకి తీసుకుని రుచిని ఆస్వాదించి, చక్కగా నమిలి మింగడాన్ని రెసిన్ ఈటింగ్ మెడిటేషన్ అంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.