Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!
పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి మొదటి వారంలో 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొంది.
కరోనా వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని అందుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా అందించే కార్యక్రమం త్వరలోనే చేపట్టనున్నట్లు NTAGI ఛైర్మన్ డా. ఎన్‌కే అరోరా తెలిపారు. ఫిబ్రవరి చివరి నుంచి ఈ వ్యాక్సినేషన్ మొదలయ్యే అవకాశం ఉందన్నారు.
జనవరి 3 నుంచి దేశంలో 15-18 ఏళ్లు ఉన్న వారికి కొవిడ్ 19 వ్యాక్సినేషన్ మొదలైంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ వీరికి అందిస్తున్నారు. ఇప్పటివరకు 3.31 కోట్ల మంది పిల్లలకు టీకాలు అందినట్లు అరోరా వెల్లడించారు.
కొవాగ్జిన్..
దేశంలో పిల్లలందరికీ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకానే అందిస్తున్నామని అరోరా అన్నారు. 15-17 ఏళ్ల వారికి ఫిబ్రవరి తొలి వారం నుంచే రెండో డోసు పంపిణీ కూడా మొదలువుతుందన్నారు. అది పూర్తయిన వెంటనే ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారం నుంచి 12-14 ఏజ్ గ్రూప్ వారికి టీకాలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి క్రమంలో స్కూళ్లు మూతపడటం, ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపైనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 12-14 ఏళ్ల పిల్లకు టీకాల పంపిణీ ముఖ్యమని డాక్టర్ అరోరా అభిప్రాయపడ్డారు.