Covaxin for kids: చిన్నారులకు కొవాగ్జిన్ టీకా.. శుభవార్త చెప్పిన భారత్ బయోటెక్
దేశంలో చిన్నారులకు త్వరలోనే వ్యాక్సిన్ అందజేయనున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇందుకు సంబంధించి తుది దశ ప్రయోగాలు పూర్తయినట్లు స్పష్టం చేసింది.
దేశంలో చిన్నారులకు శుభవార్త చెప్పింది భారత్ బయోటెక్. 18 ఏళ్లలోపు వారు కరోనాను ఎదుర్కొనే టీకా మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన 'కొవాగ్జిన్' తుది (రెండు, మూడు) దశ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఈ ప్రయోగాల సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు వచ్చే వారం అందజేస్తామని సంస్థ ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది.
ఉత్పత్తి రెట్టింపు..
కరోనా మూడో వేవ్ భయాల కారణంగా వీలైనంత మందికి వ్యాక్సిన్ అందేలా తాము కృషి చేస్తున్నట్లు బయోటెక్ సంస్థ వెల్లడించింది. కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.
సెప్టెంబర్ నెలలో 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామన్నారు. అక్టోబర్‌లో వీటి సంఖ్య 5.5 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే వీటి సంఖ్యను నెలకు 10కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Kolkata Cop: కుక్కలు తడవకుండా గొడుగు పడుతూ... ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న పోలీసు... ఫొటో వైరల్
సమర్థవంతంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజుకో కొత్త వేరియంట్‌తో కరోనా ప్రపంచాన్ని భయపెడుతోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కొంతమందికి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే డెల్టా ప్లస్ వేరియంట్‌పై కొవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని ఇటీవల చేసిన అధ్యయనంలో తేలినట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కొవాగ్జిన్.. దేశీయంగా తయారైన తొలి కరోనా టీకా. ఇప్పటికే పలు దేశాలకు కొవాగ్జిన్ టీకా ఎగుమతి అవుతుంది.
Also Read: Viral fever in India: చిన్నారుల్లో వైరల్ ఫీవర్.. ఇప్పటికే 100 మంది మృతి.. పిల్లలను ఎలా కాపాడుకోవాలి?
ముక్కు ద్వారా..
ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ టీకా తీసుకోవడం వల్ల వైరస్ శరీరంలోకి ప్రవేశించే ముక్కు మార్గంలోనే రోగనిరోధక ప్రతిస్పందనలు కలుగుతాయి. తద్వారా వైరస్ బారినపడకుండా రక్షణ కలుగుతుందని కృష్ణ ఎల్లా తెలిపారు.