Covid-19 Deaths: థర్డ్‌వేవ్ మొదలైందా? ప్రపంచవ్యాప్తంగా కరోనా పెరిగిందా? తగ్గిందా? డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్‌లో ఉన్న సంచలనాలు ఏంటి?
కరోనా ఇదే తీరుగా ప్రభావం చూపితే వచ్చే రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 200 మిలియన్లను దాటేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పెను ప్రభావం చూపుతోంది. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా సెకండ్ వేవ్ కోట్లాది ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంతో పలు దేశాలు కరోనా వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్, కర్ఫ్యూలు, ఆంక్షలు సడలించడం సరైన నిర్ణయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పలువురు ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి అనుమానమే నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
గత వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మరణాల సంఖ్య 21శాతం పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, ఆగ్నేయాసియాలోనే దాదాపు 69 వేలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించాయని తెలిపింది. అదే సమయంలో గత వారం రోజుల్లో కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆ మరణాలతో మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 194 మిలియన్ల (19.4 కోట్లు)కు చేరుకుంది. కరోనా ఇదే తీరుగా ప్రభావం చూపితే వచ్చే రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 200 మిలియన్లను దాటేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
గత కొన్ని రోజులుగా యూరప్ మినహా ఇతర ప్రాంతాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయని స్పష్టం చేసింది. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, యూకే, భారత్‌లలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయని తాజా ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు దేశాలు చిన్నారులకు కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో భారత్‌లోనూ చిన్నారులకు ఆగస్టులో వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి ఇటీవల ప్రకటన చేయడం తెలిసిందే.
భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు దాదాపుగా 40 వేల వరకు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులో దేశంలో 43,654 మందిలో కరోనా వైరస్‌ను గుర్తించారు. అదే సమయంలో 640 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ, ఆంక్షలు ఎత్తివేయడంతో కరోనా కేసులు ఆశించిన మేర తగ్గడం లేదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కేరళలో మాత్రం కరోనా కేసులతో పాటు జికా వైరస్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో మూడింట రెండొంతుల జనాభాలో యాంటీబాడీలు ఉన్నాయని సీరమ్ సర్వేలో వెల్లడైంది. ఇదివరకే కోవిడ్19 నుంచి కోలుకున్న వారిలోనూ యాంటీబాడీలు క్రమంగా తగ్గిపోతున్నాయని గుర్తించారు. కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి.