(Source: ECI/ABP News/ABP Majha)
COVID-19 Situation: చైనాలో కరోనా విజృంభణ- 60 శాతం వైరస్ బారిన పడే ఛాన్స్! భారత్ ఆరోగ్య శాఖ నేడు కీలక సమావేశం
COVID-19 Situation: 90 రోజుల్లో చైనాలో 60 శాతం జనాభా కరోనా బారిన పడే అవకాశం ఉందని ఎపిడెమియాలజిస్టులు చెబుతున్నారు.
COVID-19 Situation: చైనాలో భయంకరంగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచానికి దడ పుట్టిస్తున్నాయి. చైనా పరిస్థితి దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కరోనాపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
కరోనా పరిస్థితిపై చర్చించేందుకు కేంద్రమంత్రి మన్సుక్ మాండవియా ఈ ఉదయం 11.30 గంటలకు ఆరోగ్య శాఖతో సంబంధం ఉన్న చాలా మంది సీనియర్ అధికారులతో భేటీ కానున్నారు. కరోనా మహమ్మారిపై సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో ఆయుష్ విభాగం, ఆరోగ్య శాఖ, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ర్, నీతి ఆయోగ్ సభ్యులు తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.
కరోనా కొత్త వేరియంట్ ఉందా అని తెలుసుకోవడానికి నమోదు అవుతున్న కేసుల నమూనాలను ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం) ప్రయోగశాలకు పంపాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం (డిసెంబర్ 20) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. కొత్త వేరియంట్ బయటకు వస్తే, దానిని ట్రాక్ చేయవచ్చని సూచించింది.
చైనాలో పరిస్థితి
నిజానికి కరోనా కారణంగా చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. రాబోయే 90 రోజుల్లో చైనాలో 60 శాతం జనాభా కరోనా బారిన పడే అవకాశం ఉందని ఎపిడెమియాలజిస్టులు చెబుతున్నారు. వేగంగావ్యాప్తి చెందుతున్న వైరస్ కారణంగా మిలియన్ల మంది మరణించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. చైనా నుంచి బయటపడిన కొన్ని వీడియోల్లో, మృతదేహాలు ఆసుపత్రి మార్చురీలో పేరుకుపోవడం కనిపించింది. దాదాపు ఇరవై మృతదేహాలు నేలపై కనిపించాయి. మార్చురీ నిండుగా ఉండటంతో మృతదేహాలను ఆసుపత్రి కారిడార్‌కు తరలించారు. అంత్యక్రియల గృహాలలో మృతదేహాలు ఖననం చేయడానికి కూడా చాలా సమంయ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు.
ఒమిక్రాన్
ఎరిక్ సోమవారం ట్విట్టర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.
" చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చైనాలో ఉన్న ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉంది. వ్యాధి సోకిన ఒక్క వ్యక్తి వల్ల 16 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే.. మీరు, మీ కుటుంబం, మీ పొరుగువారు అంతా.. బైవాలేంట్ వ్యాక్సిన్ తీసుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏంటంటే.. ఎవరైతే రోగాల బారిన పడాలి అనుకుంటున్నారో పడని, ఎవరైతే మరణించాలి అనుకుంటున్నారో మరణించని అని అనుకుంటుంది. "