India Corona Cases: కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తారా.. క్లారిటీ ఇచ్చిన ఆర్థికశాఖ మంత్రి
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. 38,667 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనాతో పోరాడుతూ మరో 478 మంది మరణించారు.
LIVE
Background
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. 22,29,798 మందికి కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 38,667 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనాతో పోరాడుతూ మరో 478 మంది మరణించారు. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు 3.6 శాతం తగ్గాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
బిగ్ రిలీఫ్... 3 అతిపెద్ద రాష్ట్రాల్లో కొవిడ్19 మరణాలు నిల్
అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కరోనా తీవ్రత చాలా వరకు తగ్గింది. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 25 కొవిడ్19 కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. రాజస్థాన్‌లో 24 మంది కరోనా బారిన పడగా, గుజరాత్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఒక్క కొవిడ్19 మరణం సైతం నమోదుకాలేదు.
Karnataka Lockdown: కర్ణాటకలో లాక్‌డౌన్‌పై స్పందించిన ఆర్థికశాఖ మంత్రి.. క్లారిటీ
ఆగస్టు 15 తరువాత కర్ణాటకలో లాక్ డౌన్ విధిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేసుల పెరుగుదలే అందుకు కారణమని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోగానీ, బెంగళూరులో గానీ లాక్ డౌన్ విధించాలని ఇప్పటివరకూ ఆలోచించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థికశాఖ మంత్రి ఆర్ అశోక మాట్లాడుతూ.. కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటివి విధిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. కొవిడ్19 తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేవలం కర్ఫ్యూలు విధించడం ద్వారా కరోనాను కట్టడి చేయలేము, ప్రజలలో అవగాహన పెంచుతామన్నారు.
53.61 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
తాజాగా 38,667 మంది కరోనా బారిన పడగా, ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.21 కోట్లకు చేరింది. కొవిడ్ మరణాలు 4.30 లక్షలు దాటిపోయాయి. గడిచిన 24 గంటల్లో నిన్న 35 వేల 743 మంది కరోనా నుంచి కోలుకున్నారని తాజా హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం 3,87,673 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశలో ఇప్పటివరకూ 3,13,38,088 (3 కోట్ల 13 లక్షల 38 వేల 88) మంది కరోనా మహమ్మారిని జయించారు. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉండగా, ఇప్పటివరకూ 53.61 కోట్ల డోసుల మేర కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.