ASSOCHAM Survey: తెలుగు రాష్ట్రాల్లో షుగర్, బీపీ క్యాన్సర్ విజృంభణ.. జాతీయ సగటుతో పోలిస్తే ఆందోళనకరం.. ఆహారపు అలవాట్లు, కాలుష్యంతోనే ముప్పుందట!
అసంక్రమిత వ్యాధులు తెలుగు రాష్ట్రాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ సగటు కన్నా ఏపీ, తెలంగాణలో వీటి సగటు అధికంగా ఉందని అసోచామ్ సర్వేలో తేలింది.
అధిక రక్తపోటు, జీర్ణసంబంధిత వ్యాధులు, షుగర్, నాడీ సంబంధిత వ్యాధులు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దేశం వ్యాప్తంగా ఉన్న సగటుతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ వ్యాధుల తీవ్రత చాలా ఆందోళనకరంగా ఉందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అంటువ్యాధులు కాని రోగాలు జాతీయ సగటు 11.62 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సగటు 16.19గా ఉంది. ఈ రాష్ట్రాల్లో రక్తపోటు, జీర్ణసంబంధిత వ్యాధులు, నాడీ సంబంధిత రోగాలు ఎక్కువగా ఉన్నట్టు సర్వే చెబుతోంది. ఈ మూడింటి తర్వాత శ్వాసకోశ వ్యాధులు, మెదడుకు సంబంధించిన రోగాలు, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు సర్వేలో తేలింది.
ఆరోగ్య సంరక్షణ సర్వే
దేశంలో అత్యున్నత ట్రేడ్ అసోసియేషన్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) 'ఇల్‌నెస్ టు వెల్‌నెస్' ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులపై ఆరోగ్య సంరక్షణ సర్వే నివేదిక రూపొందించింది. "నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్: ది న్యూ హెల్త్ ఛాలెంజెస్ ఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్" అనే అంశంపై వర్చువల్ ప్యానెల్ చర్చ జరిగింది. దేశంలో పెరుగుతున్న ఎన్‌సీడీ(నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు) కేసులు వివరాలను విశ్లేషించడానికి 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది 673 పబ్లిక్ హెల్త్ ఆఫీసులను 'భారతదేశంలో నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్' పేరుతో సర్వే చేసి నివేదిక అందించింది.
NCDలతో ముడిపడి ప్రమాద కారకాలపై పరిశోధన చేశారు. ఇది జాతీయ సగటు కన్నా తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. వీటిల వల్ల గుండె, మధుమేహం, జీర్ణ సంబంధిత వ్యాధులకు దారితీస్తోందని నివేదిక తెలిపింది. ఈ ప్రాంతంలో 63 శాతం మంది అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ ప్రాంతంలో అధిక భౌతిక కార్యకలాపాలు కలిగి ఉండడం వల్ల తక్కు BMI(Body mass index)లో ప్రతిబింబిస్తుంది. తెలుగు రాష్ట్రాలో జీవన విధానం, ఉప్పు, కారం అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం సంబంధిత వ్యాధులు తక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది.
కాలుష్యమే కారకం
తెలుగు రాష్ట్రాల్లో న్యూరాలజీ, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు కాలుష్యం ప్రధాన కారణమని అధ్యయనంలో తేలింది. మైనింగ్ కార్యకలాపాలు, క్వారీలు, నిర్మాణ కార్యకలాపాల వల్ల ఈ వ్యాధులకు కారణమవుతున్నాయి. గృహ సంబంధిత కాలుష్యం వల్ల రక్తపోటు, నాడీ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయి. పనిచేసే ప్రదేశాల్లో కాలుష్యకారకాల వల్ల 82 శాతం మంది, గృహ సంబంధిత వాయు కాలుష్యం వల్ల 76 శాతం మందిలో అనారోగ్య పరిస్థితులకు కారణమౌతున్నాయని నివేదిక తెలిపింది.
కూరగాయల వినియోగం తక్కువే...
కూరగాయలు, పండ్లు వినియోగంలో జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలో తక్కువగా వినియోగిస్తున్నారు. మంస పదార్థాల వినియోగంలో ఏపీ, తెలంగాణలో అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 90 శాతం మంది మాంసాహారం తీసుకుంటున్నారు. వీరిలో 68 శాతం మంది మీట్ తింటున్నారని సర్వేలో తేలింది. వీటి వల్ల జీర్ణవ్యవస్థ, గుండె, రక్తపోటు సంబంధిత వ్యాధులు అధికంగా ఉంటున్నాయని తేలింది. పొగాకు పదార్థాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు సగటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. దీని వల్ల రాష్ట్రంలో హైపర్‌టెన్షన్, గుండె జబ్బులు మధుమేహానికి సంబంధించిన నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల ప్రాబల్యంపై జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నాయి.
మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం
జాతీయ రక్తపోటు రేటు 3.60 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 8.54 శాతంగా ఉందని అధ్యయనం తెలిపింది. రెండు రాష్ట్రాలలో జీర్ణసంబంధిత, మధుమేహం వ్యాధుల రేటు వరుసగా 5.65 శాతం, 4.69 శాతం ఉన్నాయి. జీర్ణ సంబంధిత వ్యాధులు జాతీయ సగటు రేటు 3.05 శాతం కాగా, మధుమేహం 2.85 శాతంగా ఉంది. ఏపీ, తెలంగాణలో మెదడు సంబంధిత, కిడ్నీ వ్యాధుల ప్రాబల్య రేటు వరుసగా 2.52 శాతం 0.66 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు ప్రాబల్య రేటు కన్నా అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల సంక్రమణ రేటు జాతీయ సగటు రేటు కన్నా తక్కువగా ఉంది. కోవిడ్ తర్వాత ప్రజలు ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిస్తున్నారు. కరోనా వల్ల భారత ఆరోగ్య మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడింది.
"వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నాన్ కమ్యూనికబుల్ డిసీజిస్ వల్ల ముప్పు పెరిగింది. ఆర్థికస్థితిపై కూడా ప్రభావం చూపుతోంది. ఎన్‌సీడీ కేసులను ముందుగా గుర్తించడమే కీలకం. ఈ వ్యాధులపై పోరాటానికి తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వాలు కలిసిరావాలి. అప్పుడే ఈ వ్యాధులపై విజయసాధించగలం"---
డాక్టర్ సీహెచ్ వసంత్ కుమార్
(సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్, ప్రస్తుత ప్రెసిడెంట్ ఎలెక్ట్, రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (RSSDI))
Also Read: Facebook Loans : ఇండియాలో ఫేస్‌బుక్ వడ్డీ వ్యాపారం.. గ్యారంటీల్లేకుండా రుణాలు..!