Facebook Loans : ఇండియాలో ఫేస్‌బుక్ వడ్డీ వ్యాపారం.. గ్యారంటీల్లేకుండా రుణాలు..!
ఇండిఫి అనే సంస్థతో కలిసి వడ్డీ వ్యాపారన్ని ప్రారంభిస్తున్నట్లుగా ఫేస్‌బుక్ ప్రకటించింది. ఎఫ్‌బీలో ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలకు గ్యారంటీల్లేకుండా రూ. యాభై లక్షల వరకు లోన్‌లు ఇస్తామని ప్రకటించింది.
సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న ఫేస్‌బుక్ అనుబంధ వ్యాపారాల్లోకి దూసుకొస్తోంది. అన్నింటి కంటే లాభదాయకమైన వ్యాపారం వడ్డీ వ్యాపారం అని సులువుగానే అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారు ఫేస్‌బుక్ ఓనర్లు. ముఖ్యంగా ఇండియాలో అయితే బాగా వర్కవుట్ అవుతుందని అనుకున్నారేమో కానీ రంగంలోకి దిగిపోయారు. పార్టనర్లను వెదుక్కుని వ్యాపారం ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే అప్పులు ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు. అప్పులు తీసుకోవాలంటే ఓ అర్హత ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. అదేమిటంటే... ఫేస్‌బుక్ లో ప్రకటనలు ఇవ్వడమే. ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చే వారికి మాత్రమే రుణ సదుపాయం కల్పిస్తామని ఆ సంస్థ చెబుతోంది. ఫేస్‌బుక్ అప్పులకు అసలు ఎలాంటి గ్యారంటీ తీసుకోదు.
ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చే చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నింటికీ ఇతర అర్హతలను బట్టి రుణం మంజూరు చేస్తారు. అయితే ఫేస్‌బుక్ నేరుగా ఈ వ్యాపారం చేయడం లేదు. వేరే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ పేరు ఇండిఫి ఫైనాన్షియలన్ సర్వీసెస్. వడ్డీ వ్యాపారంలోకి తొలి సారిగా అడుగుపెడుతున్నందున ముందుగా ఈ ఒక్క సంస్థతోనే ఒప్పందం చేసుకుంది. పరిస్థితిని బట్టి మరికొన్ని కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఫేస్‌బుక్ ఈ వడ్డీ వ్యాపారాన్ని మొదటగా ఇండియాలోనే ప్రారంభిస్తోంది. ఇతర దేశాల్లో ఎక్కడా ఇలాంటి ఆలోచన చేయలేదు. ఇండియాలో దాదాపుగా అన్ని ప్రధానమైన పట్టణాల్లో ఈ సేవలు అందుతాయి.
కంపెనీల చట్టం కింద రిజిస్టరయిన కంపెనీలకు రూ. ఐదు లక్షల నుంచి రూ. యాభై లక్షల వరకు ఫేస్‌బుక్ ఇండిఫి ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా అప్పు ఇస్తుంది. వడ్డీ రేటు మాత్రం కాస్త ఎక్కువే. బ్యాంకులు పర్సనల్ లోన్లు ఇచ్చే రేటు కన్నా ఎక్కువే వసూలు చేయాలని నిర్ణయించింది. 17 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించారు. మహిళలకు అయితే 0.2 శాతం రాయితీ ఇస్తారట. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఫేస్‌బుక్ ఇండియా గొప్పగా ప్రకటించకుంది. అదేంటి ఫేస్‌బుక్‌కేమీ లాభమేమీ ఉండదా.. అంటే... ఫేస్‌బుక్‌కు కూడా లాభమేనని ఆ సంస్థ ఇండియా హెడ్ కాస్త మొహమాటానికి పోయారు.
ఫేస్‌బుక్ సంస్థ ఇండియాలో బహుముఖాలుగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే జియోలో పెట్టుబడులు పెట్టింది. మరికొన్ని రకాల వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇండియాలో ఈ రుణాల మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ మార్కెట్‌ను తనకున్న ఫేస్ బుక్ యూజర్స్ ద్వారా పెంచుకునే ప్రయత్నాలను ఫేస్‌బుక్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.