Fact Check : తిరుమలలో దర్శనం టిక్కెట్లు, లడ్డూ రేట్లు తగ్గించారా ? అసలు నిజం ఇదే
Tirumala News : తిరుమలలో దర్శనం టిక్కెట్ రేట్లు, లడ్డూ ధర తగ్గింపు వార్తలు అవాస్తవం. ఈ అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ కూడా తోసి పుచ్చింది.
Tirumala Fact Check : దేవదేవుడి క్షేత్రం తిరుమల గురించి ఎలాంటి వార్త వచ్చినా భక్తులకు చాలా విలువైనదే. ఇలాంటి విషయాల్లో పేక్ న్యూస్ వైరల్ అయితే భక్తులకు అనేక సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్సించుకోవాలనుకునే భక్తులు తప్పుడు సమాచారాల వల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.
తాజాగా తిరుమల గురించి కొన్ని ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తిరుమల దర్శనం టిక్కెట్లను రెండు వందల రూపాయలకు తగ్గించారని అదే లడ్డూ ధరను యాభై రూపాయల నుంచి పాతిక రూపాయలకు తగ్గించారని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చు. కొన్ని ప్రముఖ న్యూస్ మీడియా హ్యాండిల్స్ లోనూ ఈ ఫేక్ న్యూస్ పబ్లిష్ అయింది.
( ఇక్కడ & ఇక్కడ & ఇక్కడ & ఇక్కడ )
వెరీఫైడ్ అకౌంట్స్ నుంచే ఇలా పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ పోస్ట్ చేశారు. ఈ పోస్టులన్నిటిలోనూ ఒకటే సమాచారం ఉంది. ఈ ప్రచారం క్రమంగా వైరల్ గా మారుతూండటంతో తిరుమల తిరుపతి దేవస్థాన అధికార వర్గాలు వెంటనే స్పందించారు. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేశారు.
కూటమి అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఆ సందర్భంగా టీటీడీని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. ఐదేళ్లుగా టీటీడీలో చక్రం తిప్పుతున్న ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేశారు. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించారు . శ్యామలరావు ప్రతి రోజు టీటీడీలోని రోజు వారీ వ్యవహారాలను చక్క బెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో దర్శనం రేట్లు తగ్గిస్తారన్న ప్రచారం ఊపందుకుంది అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ రేట్లు పెంచారు. వాటిని కూడా తగ్గిస్తారని అనుకుని కొంత మంది సొంతంగా ప్రచారం చేస్తున్నారు.
టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం మారగానే రాజీనామా చేశారు. ప్రస్తుతం టీటీడీకి పాలకమండలి లేనట్లే . ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయితే ఈ లోపే జరుగుతున్న ఫేక్ ప్రచారంతో భక్తులు కన్ ఫ్యూజ్‌కు గురవుతున్నారు.
విషయం : తిరుమల స్పెషల్ దర్శనం గతంలో రూ.300లు ఉండగా.. దాన్ని రూ.200. తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా లడ్డూ ధర గతంలో రూ.50 ఉండగా రూ.25కి తగ్గింపు అని ప్రచారం .
వాస్తవం : తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇప్పటి వరకూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఇలాంటి ప్రతిపాదనపై చర్చలు కూడా జరగడం లేదు. తప్పుడు ప్రచారాల వల్ల భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
This story was originally published by ABP Desam as part of the Shakti Collective.