Fact Check: కంగనా రనౌత్‌ని విమర్శిస్తూ పాడిన పాట ఇప్పటిదేనా, ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది?
Fact Check: కంగనా రనౌత్‌ని విమర్శిస్తూ పాడిన పాత పాటను ఇప్పటిదే అని కొందరు వైరల్ చేస్తున్నారు.
క్లెయిమ్ ఏమిటి?
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. సినీ నటి, ఎంపీ కంగనా రనౌత్ గురించి ఇద్దరు విమర్శిస్తూ పాట పాడారు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. దీనిని షేర్ చేసి, పంజాబ్ కి చెందిన ప్రజలు, చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో కంగనాపై చేయిజేసుకున్న సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ని సమర్ధిస్తున్నారని రాసుకొచ్చారు. కౌర్ ఇంతకుమునుపు, కంగనా రైతుల గురించి 2020 లో చేసిన వ్యాఖ్యలకు కోపంతో అలా చేసినట్టు తెలిపారు.
రనౌత్ ఈమధ్య కాలం లో జరిగిన భారతీయ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఆ వీడియోని షేర్ చేసి ఒక ఎక్స్ యూజర్ హిందీ లో ఇలా రాసారు, “కంగనా రనౌత్ చెంపదెబ్బ ఘటన: పంజాబ్ వాసులు మరియు రైతులు సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ని సమర్ధిస్తున్నారు. పాటలు కుడా రాస్తున్నారు. హర్యానా ఎన్నికలలో కంగనా బీజేపీకి ఇబ్బంది లాగే ఉంది.” ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 1,15,000 వ్యూస్ ఉన్నాయి, అలాంటి మరిన్ని ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఒరిజినల్ వీడియో, వైరల్ వీడియో స్క్రీన్ షాట్లు (Source : X/Facebook/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ వీడియో 2020 నాటిది. రైతుల నిరసనల నేపధ్యం లో ఇద్దరు అక్క చెల్లెల్లు ఈ పాటను పాడారు.
మేము తెలుసుకున్నదేంటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, వైరల్ అవుతున్న వీడియోకి మరింత నిడివి గల వీడియో మాకు యూట్యూబ్ లో ‘RAMNEEK-SIMRITA’ అనే ఛానల్ లో లభించింది. దీనిని డిసెంబర్ 6, 2020 నాడు అప్లోడ్ చేశారు. ఆర్కైవ్ ఇక్కడ.
వార్తా కథనాల ప్రకారం, పంజాబ్ లోని మొహాలీ అనే ప్రాంతంలో ఉండే ఇద్దరు అక్క చెల్లెల్లు పాడారు. రైతుల నిరసన నేపధ్యంలో ఇంకెన్నో పాటలు కుడా సమకూర్చారు.
ఈ వీడియో శీర్షికలో ఈ పాటను నటి కంగనా రనౌత్ మరియు పాయల్ రోహత్గి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా విడుదల చేశారు అని తెలియజేసారు. యూట్యూబ్ వీడియోలో గాయకులు తాము రామ్నీక్ మరియు సిమ్రీతా అని తెలిపారు. పైగా ఈ పాటలో కొన్ని లైన్లు, రనౌత్ మరియు రోహత్గి రైతులపై చేసిన వ్యాఖ్యల గురించి రాసారు అని తెలిపారు.
కానీ వైరల్ అవుతున్న వీడియోలో వారు ఈ సందర్భాన్ని వివరించే భాగాన్ని తీసివేశారు. యూట్యూబ్ వీడియోలో పాటకి సంబంధించిన పంజాబీ లిరిక్స్ కుడా జతపరిచారు.
ఒరిజినల్ వీడియో, వైరల్ వీడియో స్క్రీన్ షాట్లు (Source : X/Facebook/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
వారి ఇంస్టాగ్రామ్ పేజీలో అలాంటి వీడియో పంజాబ్ లిరిక్స్ తో సహా అప్లోడ్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ).
లాజికల్లీ ఫ్యాక్ట్స్ వారిని స్పందన కోసం సంప్రదించింది. స్పందన రాగానే ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాము.
రనౌత్ మరియు రోహత్గి ఏమన్నారు?
ప్రస్తుతం డిలీట్ చేయబడిన ఒక ఎక్స్ పోస్టులో రనౌత్ ఒక పెద్ద వయసు ఉన్న మహిళ ఫొటోని షేర్ చేసి, ఇలా రైతు ఉద్యమంలో కుర్చున్నందుకు ఒక్కొక్కరికి వంద రూపాయలు ఇస్తున్నారు అని తెలిపారు. రనౌత్ వ్యాఖ్యలను అనేక మంది విమర్శించారు.
రామ్నీకి సిమ్రీతా పోస్ట్ చేసిన మ్యూజిక్ వీడియో లో కుడా ఆ పెద్ద వయసు మహిళ గురించి, వంద రూపాయలు తీసుకోవటం గురించి పాడారు, దీనిని మనం 0:52 - 1:00 వద్ద వినవచ్చు.
రోహత్గి కుడా రైతుల నిరసనలకి వ్యతిరేకంగా అనేక వీడియోలు తమ యూట్యూబ్ లో 2020-2021 మధ్య షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ).
తీర్పు
వైరల్ వీడియోని తప్పుగా కంగనా రనౌత్ పై దాడి ఘటన తరువాత పాటగా షేర్ చేస్తున్నారు. కానీ ఈ పాటని 2020 లో రైతుల నిరసన సమయంలో ఇద్దరు అక్క చెల్లెల్లు కంగనా మరియు రోహత్గి చేసిన వ్యాఖ్యలకు జవాబుగా పాడారు.
This story was originally published by Logically Facts, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.