Fact Check: I.N.D.I.A కూటమికి అనుకూలంగా ప్రధాని మోదీ ట్వీట్? అసలు నిజమిదే
Fact Check: ప్రధాని మోదీ ఇండియా కూటమికి అనుకూలంగా పోస్ట్ పెట్టారంటూ ఓ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వదంతులతో చాలా మంది నేతలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Fact Check: సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు కొదవే లేదు. ఇక ఎన్నికల సమయంలో అయితే ఇవి ఇంకాస్త పెరిగిపోతాయి. లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా ప్రచారం చేస్తుంటారు. ఈ వదంతులతో చాలా మంది నేతలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఇదే సమస్య ఎదురైంది. ఆయన ట్వీట్‌కి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో I.N.D.I.A కూటమికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని తెలిసిందన్నది ఆ పోస్ట్ సారాంశం. రికార్డు స్థాయిలో ఆ పార్టీలకు ఓట్లు పడినట్టుగా తనకు సమాచారం అందిందని ప్రధాని మోదీయే స్వయంగా ట్వీట్ చేసినట్టుగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ ఏంటి..? ప్రతిపక్ష కూటమికి ఓట్లు పడ్డాయని చెప్పడమేంటి..? అనే అనుమానం అందరికీ వస్తుంది. అందుకే...అసలు ఇది నిజమా కాదా అని ఫ్యాక్ట్‌చెక్ చేసింది PTI Fact Check Desk. ప్రధాని మోదీ X అకౌంట్‌లో పెట్టిన ఈ పోస్ట్‌ని (పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఎడిట్ చేశారని, ఆ స్క్రీన్ షాట్ పేక్ అని తేల్చి చెప్పింది.
క్లెయిమ్ (ప్రచారం)
ఏప్రిల్ 20వ తేదీన సోషల్ మీడియాలో ఓ ఫేస్‌బుక్ యూజర్ ఈ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేశాడు. లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌లో ప్రతిపక్ష కూటమికే ఎక్కువ ఓట్లు పడ్డాయని తెలిసిందని ప్రధాని మోదీ ట్వీట్ చేసినట్టుగా ఉంది. "తొలి విడతలోనే అపూర్వ స్పందన వచ్చింది. ఓటు వేసిన వాళ్లందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. I.N.D.I.A కూటమికే రికార్డు స్థాయిలో ఓట్లు పడినట్టు నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది" అని మోదీ ట్వీట్ చేసినట్టుగా ప్రచారం చేశాడు ఆ యూజర్. పైగా ఈ ఎన్నికల్లో NDA గెలవడం కష్టమేనంటూ ఆ పోస్ట్‌కి క్యాప్షన్ కూడా పెట్టాడు.
నిజమేంటి..?
అయితే...ఈ స్క్రీన్‌షాట్‌ని గూగుల్ లెన్స్‌తో చెక్ చేయగా ఇలాంటిదే మరో పోస్ట్ కూడా కనిపించింది. ఇదే స్క్రీన్‌షాట్‌ని X లోనూ షేర్ చేశారని తెలిసింది. ఈ పోస్ట్‌ల ఆధారంగా X అంతా జల్లెడ పట్టింది ఫ్యాక్ట్‌చెక్ టీమ్. ఏప్రిల్ 19వ తేదీన ప్రధాని మోదీ పెట్టిన పోస్ట్ (పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ) కనిపించింది. అందులో NDAకి రికార్డు స్థాయిలో ఓట్లు పోల్ అయినట్టుగా ఫీడ్‌బ్యాక్ వచ్చిందని ప్రస్తావించారు మోదీ. కానీ..NDA స్థానంలో INDIA అని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో యూజర్. మొత్తంగా ఒరిజినల్ పోస్ట్‌ని మార్చి ఇలా ఓ నకిలీ ట్వీట్‌ని సృష్టించారని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. డిజిటల్ టూల్స్‌తో ఇలా కంటెంట్‌ని చాలా సులువుగా ఎడిట్ చేశారని, మోదీ ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా పోస్ట్ పెట్టారని ప్రచారం చేశారు. అంటే...ఇప్పుడు వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫేక్ అన్నమాట.
This story was originally published by PTI News, as part of the Shakti Collective. Except for the headline, excerpt, and the opening introduction para, this story has not been edited by ABPLIVE staff.
Also Read: Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ